ఐర్లాండ్‌ ప్రధానిగా రెండోసారి భారత సంతతి వ్యక్తి

18 Dec, 2022 08:13 IST|Sakshi
లియో వరాద్కర్‌

డబ్లిన్‌: భారత సంతతికి చెందిన లియో వరాద్కర్‌ ఐర్లాండ్‌ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రొటేషన్‌ పద్ధతిలో ఫిన్‌గేల్‌ పార్టీకి చెందిన వరాద్కర్‌కు మరోసారి అవకాశం దక్కింది. 2017లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2020లో ఫిన్‌గేల్‌, మార్టిన్ ఫియన్నాఫెయిల్‌ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రొటేషన్‌ పద్ధతిలో వరాద్కర్‌కు మరో అవకాశం లభించింది. మైఖెల్‌ మార్టిన్‌ స్థానంలో ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. 

రెండోసారి అవకాశం లభించిన క్రమంలో డబ్లిన్‌లోని ఐర్లాండ్‌ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు లియో వరాద్కర్‌. ‘ మన పౌరులందరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలను అందించాలనే కాంక్షతో వినయంగా, సంకల్పంతో ఈ నియామకాన్ని అంగీకరిస్తున్నా. ఐర్లాండ్‌ ప్రధానిగా అవకాశం రావటం జీవతకాల పురస్కారం. గత 100 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి ఆధారంగా రానున్న తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తా. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రచించి పక్కాగా అమలుపరుస్తాను. కరోనా వ్యాప్తి సమయంలో సహకారం అందించిన మైఖేల్‌ మార్టిన్‌కు కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నారు వరాద్కర్‌. 

ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న లియో ఐర్లాండ్‌లోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా గతంలోనే చరిత్ర సృష్టించారు. 38 ఏళ్లకే అత్యున్నత పదవిని చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగానూ నిలిచారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కళాశాలలో మెడికల్‌ డిగ్రీ అందుకున్న వరాద్కర్‌.. మొదట ప్రాక్టీస్‌ మొదలు పెట్టినా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2007 తొలిసారి గెలుపొందారు. 2015లో స్వలింగ వివాహాలను చట్టబధ్దం చేసింది. ఈ క్రమంలో తాను గే అని బహిరంగంగానే ప్రకటించారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం.. రష్యా మాస్టర్‌ ప్లాన్‌తో తీవ్ర ఇబ్బందులు

మరిన్ని వార్తలు