యూకే కోర్టు: భారత సంతతి వ్యక్తికి జీవితఖైదు

17 Sep, 2020 15:43 IST|Sakshi

లండన్‌: తనతో విడిపోయిన భార్యను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తికి యూకే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 23 ఏళ్ల జిగుకుమార్ సోర్తి అనే భారత సంతతి వ్యక్తి తన భార్య భవిని ప్రవీన్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం వీధిలో కనిపించిన ఒక పోలీసు అధికారితో తన భార్యను హత్య చేసినట్లు తెలిపాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా పెరోల్‌ ఇవ్వడానికి కంటే ముందు 28 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 

‘ఇది భయంకరమైన, క్రూరమైన, కనికరంలేని హత్య. కేవలం 21 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక అందమైన, ప్రతిభావంతులైన యువతి ప్రాణాలను దారుణంగా తీశారు’ అని జస్టిస్ తిమోతి స్పెన్సర్ బుధవారం లీసెస్టర్ క్రౌన్ కోర్టులో విచారణలో భాగంగా జిగుకుమార్ సోర్తితో అన్నారు.

లీసెస్టర్‌ నగరంలో నివసించిన భవిని ప్రవీన్‌ కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి 2వ తేదీ 12:30 నిమిషాల సమయంలో ఆమె దగ్గరకు వెళ్లిన జిగుకుమార్‌ కొద్ది సేపు ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను కత్తితో పొడిచి, ఆ కత్తిని అక్కడే వదిలేసి బయటకు వచ్చాడు. పోలీసులకు స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు భవినిని హాస్పటల్‌లో చేర్పించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పోస్ట్‌మార్టంలో ఆమెను అనేక సార్లు పొడవడంతో గాయాలయ్యి మరణించినట్లు వెల్లడయ్యింది. 

చదవండి: తీన్మార్‌ మల్లన్న హద్దులు దాటాడు..
 

మరిన్ని వార్తలు