‘నీ ఇంటిని 1 మీటరు జరుపు లేదంటే రూ.1.6కోట్లు కట్టు’

24 May, 2021 19:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భారత సంతతి వ్యక్తికి ఎదురైన వింత అనుభవం

దావా వేసిన న్యూజిలాండ్‌ కంపెనీ

ఆక్లాండ్: మనిషి జీవితంలో ఉండే అతి ముఖ్యమై కల సొంత ఇంటి నిర్మాణం. చనిపోయేలోపు తమకంటూ ఓ ఇంటిని నిర్మించుకోవాలని ఆశపడతారు చాలా మంది. ఇక న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి  కూడా ఇదే విధంగా అనుకుని సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అయితే అతడి కల నెరవేరుతుందని సంతోషించేలోపల ఓ వింత సమస్య అతడి ముందుకు వచ్చింది. దాంతో అతడు తలపట్టుకున్నాడు. ఇంతకు ఆ సమస్య ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

ఆక్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన దీపక్‌ లాల్‌ గతతేడాది పాపాకూర్‌లో సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. మూడు పడక గదులతో అత్యంత సౌకర్యవంతంగా నిర్మాణం చేయబోతున్న ఆ ఇంటిని చూసుకుని తెగ మురిసిపోతున్నాడు దీపక్‌ లాల్‌. సీ94 డెవలప్‌మెంట్‌ అనే కంపెనీ వేసిన దావాతో అతడి ఆనందం ఆవిరవ్వమడమే కాకా షాక్‌తో చలిజ్వరం పట్టుకున్నట్లు అయ్యింది. 

దావా ఏంటంటే..
సీ94 డెవలప్‌మెంట్‌ ఫిర్యాదు ఏంటంటే మిస్టర్‌ లాల్‌ తన ఇంటిని చట్టబద్ధంగా తనకు సంక్రమించిన స్థలంలో కాకుండా ఒక మీటర్‌ వేరే వారి స్థలంలో నిర్మిస్తున్నాడు. దాంతో సదరు సంస్థ దీపక్‌ లాల్‌ మీద దావా వేసింది. అతడు ఇంటిని తనకు చట్టబద్ధంగా సంక్రమించిన స్థలంలోకి జరపాలి.. లేదంటే 3,15,000డాలర్ల(సుమారు 1.6 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాడు. దాంతో దీపక్‌ లాల్‌ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. 

ఈ సందర్భంగా దీపక్‌ లాల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్య నా పాలిట ఓ పీడకలల తయారయ్యింది. దీని గురించి ఆలోచిస్తూ రాత్రుళ్లు నిద్రపోవడం మానేశాను. చివరకు ఇది ఎలా పరిష్కారం అవుతుందో అంతుపట్టడం లేదు’’ అని వాపోయాడు. ఇంటిని నిర్మించడానికి అంగీకరించిన డిజైనర్, హెచ్క్యూ డిజైన్స్ ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను దాఖలు చేశారని.. వాటిని ఆక్లాండ్ కౌన్సిల్ ఆమోదించింది అని తెలిపాడే లాల్‌.  అందువల్ల ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత వారిదే అన్నాడు. 

ఇక ఈ సమస్యకు సంబంధించి ఒకరినొకరు నిందించకుంటున్నారు తప్ప సమస్యను పరిష్కరించే మార్గం చూడటం లేదు అన్నాడు దీపక్‌ లాల్‌. ‘‘ఇంటిని జరపడానికి నేను సిద్ధం. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పటికే ఈ కొత్త ఇంటి మీద తనఖా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి అద్దె కోసం వారానికి 1000 డాలర్లు చెల్లిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీన్ని అమ్మలేను.. రోజులు గడుస్తున్న కొద్ది ఇది మరింత జటిలం అవుతుందని’’ వాపోయాడు లాల్‌. 

చదవండి: పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్‌ స్థాయికి..‌

మరిన్ని వార్తలు