Rishi Sunak Old Video: బ్రిటన్‌ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు

11 Jul, 2022 16:19 IST|Sakshi

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ పొలిటీషియన్‌ రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. పీపుల్స్‌ ఛాయిస్‌గా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది అక్కడ . ఈ తరుణంలో.. ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్‌ కావడమే కాదు.. విమర్శలకు తావు ఇస్తోంది. 

ఆయన చేసినవి వర్గీకరణ, వివక్షకు సంబంధించిన వ్యాఖ్యలు కావడమే విమర్శలకు ప్రధాన కారణం. కేవలం ఏడు సెకండ్ల నిడివి ఉన్న వీడియోనే హైలెట్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు కొందరు. తనకు రాజకుటుంబానికి చెందిన వాళ్లు, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లే స్నేహితులుగా ఉన్నారని, వర్కింగ్‌ క్లాస్‌ నుంచి స్నేహితులెవరూ లేరంటూ చాలా క్యాజువల్‌గా సమాధానం ఇచ్చాడు రిషి సునాక్‌. 2001లో బీబీసీ డాక్యుమెంటరీ కోసం చేసిన ఇంటర్వ్యూలో రిషి సునాక్‌ పైవ్యాఖ్యలు చేశాడు. 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుండడంపై.. పీపుల్స్ ఛాన్స్‌లర్‌ ఇతనేనా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. శ్రమ జీవి వర్గాన్ని గౌరవించలేనివాడు ప్రధాని పదవికి ఎలా అర్హుడు అవుతాడంటూ నిలదీస్తున్నారు మరికొందరు. అయితే పనిమాలా కొందరు ఈ పని చేస్తుండడంతో..  రిషికి మద్దతుగా నిలుస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కన్జర్వేటివ్‌ పార్టీ తరపున రిచ్‌మండ్‌(యార్క్స్‌) పార్లమెంట్‌ సభ్యుడైన సునాక్‌ రిషి.. ఎక్స్‌చెకర్‌ ఛాన్స్‌లర్‌ పదవికి రాజీనామా సైతం చేశారు. దీంతో ప్రధాని రేసులో ఈయన పేరే ప్రముఖంగా ఉంది అక్కడ.

మరిన్ని వార్తలు