బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. గెలిపిస్తే సంక్షోభం నుంచి గట్టెకిస్తా..

23 Oct, 2022 16:15 IST|Sakshi

లండన్‌: భారత సంతతికి చెందిన రిషి సునాక్ తాను మరోసారి బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత గొప్ప దేశమైన బ్రిటన్‌.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని పేర్కొన్నారు. తాను ప్రధాని అయి పరిస్థితిని చక్కదిద్దుతానని, పార్టీని ఏకం చేసి అందరి మద్దతుతో దేశాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ‍ట్వీట్ చేశారు.

గతంలో తాను ఆర్థిక మంత్రిగా పని చేసిన విషయాన్ని రిషి సునాక్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. అయితే అందరూ అనుకున్న దానికంటే కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. అందుకే ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాలకు మనకంటే ఎక్కువ అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉండాలన్నారు. తాను పార్టీ నాయకుడిగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.

రిషి సునాక్ ప్రధాని పదవికి పోటీ చేసి రెండు నెలలు కూడా గడవలేదు. లిజ్ ట్రస్‌తో పోటీ పడిన ఆయనకు సొంత ఎంపీల మద్దతు లభించినా.. పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఓట్లు రాలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రస్ ఘోరంగా విఫలం కావడంతో 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు నెలల వ్యవధిలోనే మరోసారి కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది.

అయితే ఈసారి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కూడా పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా 100మందికిపైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే బోరిస్ తన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈసారైనా రిషి ప్రధాని అవుతారో లేదో చూడాలి.
చదవండి: రిషి, బోరిస్‌ నువ్వా, నేనా?

మరిన్ని వార్తలు