ప్రధాని మోదీతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ

20 May, 2023 15:11 IST|Sakshi

ప్రధాని మోదీ - ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భేటీ

రష్యా యుద్ధం తర్వాత తొలిసారి మోదీని కలిసిన జెలెన్ స్కీ

శాంతి కోసం భారత్ ఏమైనా చేస్తుందన్న మోదీ

శాంతి పరిరక్షణ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ

టోక్యో: భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే.. మోదీతో జెలెన్‌ స్కీ సమావేశమయ్యారు.

ఉక్రెయిన్ కోసం, అలాగే శాంతి కోసం భారత్ ఎలాంటి ప్రయత్నానికైనా సిద్ధమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.  2022, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దురాక్రమణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ-జెలెన్‌స్కీల తొలిసారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ తో రష్యా సంబంధాల దృష్ట్యా .. ఉక్రెయిన్, రష్యాల మధ్య రాజీ చర్చలకు ప్రస్తుత పరిస్థితుల్లో మోదీకి మించిన నాయకుడు ఇంకొకరు లేరు. రెండు పక్షాలు నమ్మదగిన ఏకైక దేశం, వ్యక్తి మోదీనే. ఇప్పటికే యుద్ధం వల్ల  లక్షలాది మంది చనిపోవడం, గాయపడడం లేదా శరణార్థులుగా మారిన దృష్ట్యా.. అర్జంటుగా యుద్ధం ఆపాల్సిన సమయం ఆసన్నమయింది.

ఇదిలా ఉంచితే, మోదీపై తన ఆప్యాయతను ప్రదర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. శనివారం హిరోషిమా(జపాన్‌)లో జీ7 సదస్సు సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే.. బైడెన్‌ రాకను గమనించి కుర్చీలోంచి లేచి మరీ ఆలింగనం చేసుకున్నారాయన. ఈ సందర్భంగా బైడెన్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే వేదికగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను సైతం ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని పలకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్ స్కోల్జ్ తో సైతం మోదీ భేటీ అయ్యారు.జీ7 సదస్సు కోసం ఒకరోజు ముందుగానే జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ..  ఆ దేశ ప్రధాని కిషిదాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు