భారత నిపుణుల చూపు కెనడా వైపు

16 Jul, 2021 04:02 IST|Sakshi

కాలం చెల్లిన అమెరికా ఇమిగ్రేషన్‌ చట్టాల ఫలితం

అమెరికా ప్రజా ప్రతినిధులను హెచ్చరించిన నిపుణులు

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాలు, తదితర కాలం చెల్లిన ఇమిగ్రేషన్‌ విధానాల ఫలితంగా భారతీయ నిపుణులు అమెరికాకు బదులు కెనడాకు తరలిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డు (శాశ్వత నివాస) హోదాను దేశాలవారీ కోటా ప్రకారం మంజూరు చేయడం కూడా ఇందుకు కారణమని తెలిపారు. హెచ్‌–1బీ వీసా గానీ, శాశ్వత నివాస హోదా పొందడం గానీ కెనడాతో పోలిస్తే అమెరికాలో కష్టతరమైన విషయం కాబట్టే ఇలా జరుగుతోందన్నారు.

అమెరికాకు రావాల్సిన భారత నిపుణులు, విద్యార్థులు కెనడా వైపు మొగ్గు చూపడాన్ని ఆపేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్‌ అనుమతి కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగిత ఆధారంగా భారతీయులకు ఇచ్చే మూడు రకాలైన వీసాల సంఖ్యను ప్రస్తుతమున్న 9,15,497 నుంచి 2030కల్లా 21,95,795కు పెరిగేలా చూడాలని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్టువార్ట్‌ ఆండర్సన్‌ చెప్పారు.

గ్రీన్‌కార్డ్‌ కోసం ఏళ్లుగా, దశాబ్దాలుగా ఎదురుచూసే వారి సంఖ్యను 20 లక్షల నుంచి కనీస స్థాయికి తగ్గించాలంటూ ఆయన హౌస్‌ జ్యుడిషియరీ కమిటీలోని ఇమిగ్రేషన్, సిటిజన్‌షిప్‌ ఉపకమిటీ ఎదుట హాజరై తెలిపారు. అమెరికా యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్‌ చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016–17, 2018–19 సంవత్సరాల్లో 25%పైగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. అమెరికా వర్సిటీల్లోని ఫుల్‌టైమ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల్లో 75% మంది విదేశీయులు కాగా, వారిలో 2016–17లో మూడింట రెండొంతులు భారతీయులే ఉన్నారని ఆయన వివరించారు. అదే సమయంలో, కెనడాలో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016లో 76,075 కాగా 2018 నాటికి ఇది 127% పెరిగి 1,72,625కు చేరిందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు