‘కరోనా’ మూలాలపై అన్వేషణ!

15 Oct, 2021 05:01 IST|Sakshi

డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో మరో బృందం

భారత శాస్త్రవేత్త రామన్‌ గంగఖేడ్కర్‌కు చోటు

జెనీవా: భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మూలాలను కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకయిందా? లేక సహజ సిద్ధంగానే సంక్రమించిందా? అన్న దిశగా ఇప్పటి వరకు జరిపిన విచారణ అసంపూర్తిగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ వైరస్‌ల గుట్టుని నిగ్గు తేల్చడానికి శాస్త్రవేత్తల బృందాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసింది.

ఈ బృందం కరోనా వైరస్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్‌ల పుట్టుకపై అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా ఈ తరహా వైరస్‌ల పుట్టుకపై అధ్యయనాలు ఎలా చేయాలో సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు కొన్ని మార్గదర్శకాలను సైతం రూపొందిస్తుంది. ఈ బృందంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 700 దరఖాస్తులు రాగా, అందులో 25 పేర్లను డబ్ల్యూహెచ్‌ఓ ఎంపిక చేసింది. బృంద సభ్యుల పేర్లతో త్వరలో తుది జాబితాను వెల్లడించనుంది.

ఇదే ఆఖరి అవకాశం
డబ్ల్యూహెచ్‌ఓ సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఫర్‌ ది ఆరిజన్స్‌ ఆఫ్‌ నోవెల్‌ పాథోజెన్స్‌(సాగో) అని పిలిచే ఈ ప్రతిపాదిత బృందంలో ఒక భారతీయ శాస్త్రవేత్తకి సైతం చోటు లభించడం విశేషం. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నుంచి గత ఏడాదే పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త డాక్టర్‌ రామన్‌ గంగఖేడ్కర్‌ డబ్ల్యూహెచ్‌ఓ బృందంలో పని చేసే అవకాశం ఉంది. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టే నిపుణుడిగా రామన్‌కు పేరుంది. ఐసీఎంఆర్‌లో పనిచేస్తూ రెండేళ్ల పాటు నిఫా వైరస్, కరోనా వైరస్‌లను ఎదుర్కోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

కరోనాతో పాటు వివిధ వైరస్‌ల గుట్టుమట్లను తెలుసుకునేందుకు సైంటిస్టులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న డబ్ల్యూహెచ్‌ఓ వారిచ్చే సూచనల మేరకు నడుచుకోనుంది. కరోనా వైరస్‌ మూలాలను కనుక్కోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ అధా్నమ్‌ ఘెబ్రాయసిస్‌ అన్నారు. గత బృందంలో సభ్యులుగా ఉండి, చైనాలో పర్యటించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఈసారి కూడా చోటు కల్పించారు. కాగా డబ్ల్యూహెచ్‌ఓ విచారణలో ఏమైనా రాజకీయపరమైన అవకతవకలు జరిగితే సహించేది లేదని చైనా హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌ఓ బృందానికి శాస్త్రీయంగా మద్దతు ఇస్తామే తప్ప రాజకీయం చేస్తే ఊరుకోబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ తేల్చి చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు