Vinisha Umashankar: మీ తీరు చూస్తోంటే..కోపం వస్తోంది! శభాష్‌ వినీషా!

4 Nov, 2021 01:09 IST|Sakshi

కాప్‌ 26 సదస్సులో భారతీయ బాలిక ప్రసంగం 

ప్రపంచ దేశాధినేతలు ఫిదా 

గ్లాస్గో: వాతావరణ మార్పులపై గ్లాస్గోలోని కాప్‌–26 సదస్సులో భారత్‌కు చెందిన 14 ఏళ్ల వయసున్న టీనేజ్‌ బాలిక వినీశా ఉమాశంకర్‌ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేసింది. ఎకో ఆస్కార్‌ అవార్డులుగా భావించే ఎర్త్‌ షాట్‌ ప్రైజ్‌ ఫైనలిస్ట్‌ అయిన వినీశ కాప్‌ ఇతర పర్యావరణ పరిరక్షకులతో కలిసి ప్రిన్స్‌ విలియమ్‌ విజ్ఞప్తి మేరకు సదస్సులో మాట్లాడింది.

‘‘మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. ఇక మీరు మాటలు ఆపాలి. చేతలు మొదలు పెట్టాలి. భూమి ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి ఇక కొత్త ఆలోచనలు చేయాలి. మీరు ఏమీ చేయకపోతే ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ విజేతలు, ఫైనలిస్టులు చర్యలు తీసుకుంటారు. మా దగ్గర ఎన్నో వినూత్న ప్రాజెక్టులు , పరిష్కార మార్గాలు ఉన్నాయి’ అని చెప్పింది. ప్రధాని మోదీ, బ్రిటన్‌ ప్రధాని జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ల సమక్షంలో తమిళనాడుకి చెందిన వినీశ  ధైర్యంగా మాట్లాడింది.

’‘మీరు ఇచ్చిన శుష్క వాగ్దానాలతో మా తరం విసిగిపోయింది. మీ అందరిపైనా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. అయినా అవన్నీ ప్రదర్శించడానికి మాకు టైమ్‌ లేదు. మేము పని చెయ్యాలి. నేను కేవలం భారత్‌కు చెందిన అమ్మాయిని మాత్రమే కాదు. ఈ పుడమి పుత్రికని. అలా చెప్పుకోవడానికే గర్విస్తాను. భూమిని కాపాడుకోవడానికి పాత పద్ధతుల్ని ఇక విడిచిపెట్టండి. సృజనాత్మక ఆలోచనలు చేసే మాకు మద్దతుగా నిలవండి. మీ సమయాన్ని, డబ్బుల్ని మాపై వెచ్చించండి. మా భవిష్యత్‌ని మేమే నిర్మంచుకోవడానికి మద్దతునివ్వండి’’’ అని వినీశ చేసిన ప్రసంగానికి సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది.

 


 

మరిన్ని వార్తలు