భారత వ్యాక్సిన్లపై స్పందించిన అమెరికా శాస్త్రవేత్త

7 Mar, 2021 19:47 IST|Sakshi

హ్యూస్టన్‌: అంత‌ర్జాతీయ‌ సంస్థల‌తో క‌లిసి భారత్‌ తయారు చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్లు (కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌) ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం నుంచి కాపాడాయని అమెరికా శాస్త్రవేత్త, బేల‌ర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీట‌ర్ హోటెజ్ అన్నారు. కరోనా కష్టకాలంలో భార‌త్ ప్రపంచానికి ఫార్మసీలా వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. డీజీసీఏ అనుమ‌తి కలిగిన ఆ రెండు వ్యాక్సిన్ల పనితీరు చాలా మెరుగ్గా ఉందని, వాటి పనితీరు అన్ని వయసుల వారిపై సమానంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకే ప్రపంచ దేశాలన్నీ భారత వ్యాక్సిన్ల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. 

వ్యాక్సిన్ల తయారీ విషయంలో భారత్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలు లేదని హెచ్చరించారు. కొవిడ్‌-19 వ్యాక్సినేష‌న్ వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల తయారీలో భారత పాత్రను ప్రశంసించారు. వైర‌స్‌పై పోరాటంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి భారత్‌ ప్రపంచానికి పెద్ద బ‌హుమ‌తే ఇచ్చిందని కొనియాడారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ప్రభావం అంత‌ంతమాత్రంగానే ఉండగా.. భారత వ్యాక్సిన్లు ప్రపంచాన్ని ర‌క్షించాయ‌ని పేర్కొన్నారు. కాగా, బీసీఎం, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీతో క‌లిసి భారత్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు