అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్‌

26 Aug, 2021 04:37 IST|Sakshi

అమెరికన్ల సగటు సంపాదన కంటే రెట్టింపు సంపాదన

అక్కడి జనాభా గణాంకాలను విశ్లేషించిన న్యూయార్క్‌ టైమ్స్‌

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయులు ధనవంతులుగా అవతరించారని అక్కడి తాజా జనాభా గణాంకాల్లో వెల్లడైంది. అక్కడి భారతీయులు సగటున ఏడాదికి దాదాపు రూ.91.76 లక్షలు (1,23,700 డాలర్లు) సంపాదిస్తున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ తన విశ్లేషణలో పేర్కొంది. ఈ మొత్తం అక్కడి అమెరికా జాతీయ సగటు వార్షిక ఆదాయం దాదాపు రూ.47.42లక్షల(63,922 డాలర్ల) కంటే రెట్టింపు ఉండటం విశేషం. మధ్యతరగతి కుటుంబాల ఆర్జనలో అక్కడి ఇతర ఆసియా దేశాల వారితో పోల్చినా భారతీయుల వార్షిక ఆర్జన అధికంగానే ఉంది. తైవాన్‌ దేశస్తులు దాదాపు రూ.72 లక్షలు(97,129 డాలర్లు), ఫిలిప్పీన్‌ దేశస్తులు రూ.70.40 లక్షలు(95,000 డాలర్లు) సంపాదిస్తున్నారు.

అమెరికన్‌ కుటుంబాల్లో దాదాపు రూ.29.67లక్షల(40వేల డాలర్ల)లోపు వార్షిక సంపాదన ఉన్న కుటుంబాలు 33 శాతం ఉండగా, కేవలం 14 శాతం భారతీయ కుటుంబాలే అంత తక్కువగా సంపాదిస్తున్నాయి.  గత మూడు దశాబ్దాల కాలంలో అమెరికాలో ఆసియన్ల జనాభా ఏకంగా మూడు రెట్లు పెరిగింది. అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న జనాభా ఆసియన్లదే. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.

వీరిలో 16 లక్షల మంది వీసాదారులున్నారు. 14 లక్షల మంది గ్రీన్‌కార్డు సంపాదించి శాశ్వత స్థిరనివాస హోదా పొందారు. 40 లక్షల మందిలో దాదాపు 10 లక్షల మంది అక్కడ జన్మించిన వారే ఉండటం గమనార్హం. అమెరికా జనాభాలో సగటున 34 శాతం మంది గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగా, అక్కడి భారతీయుల్లో ఏకంగా 79 శాతం మంది పట్టభద్రులు ఉండటం విశేషం. అమెరికాలోనే జన్మించిన ఆసియన్‌ అమెరికన్ల జనాభాలో యువత సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా సగం మంది చిన్నారులే. 

మరిన్ని వార్తలు