భారత్‌లో కరోనా పరిస్థితి విషాదకరం

2 May, 2021 01:02 IST|Sakshi

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ 

భారతదేశ ప్రజలకు అండగా ఉంటాం 

వాషింగ్టన్‌: భారత్‌లో కోవిడ్‌–19 మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో పరిస్థితి విషాదకరంగా మారిందని అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ పేర్కొన్నారు. ఈ సవాలును ఎదుర్కొనే విషయంలో భారతదేశ ప్రజలకు పూర్తి మద్దతుగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. ఆమె తాజాగా సిన్సినాటీలో మీడియాతో మాట్లాడారు. కరోనా బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. కరోనా సోకి చికిత్స పొందుతున్నవారు పూర్తిగా కోలుకొని, ఆరోగ్యవంతులవ్వాలని ఆకాంక్షించారు.

పీపీఈ కిట్లు, ఇతర అవసరాల కోసం భారత్‌కు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో భారత్‌ నుంచి రాకపోకలపై అమెరికా ప్రభుత్వం ఇటీవలే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను ప్రకటించిన తర్వాత ఇండియాలోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడలేదని కమలా హ్యారిస్‌ చెప్పారు. భారత్‌ నుంచి ప్రయాణాలపై ఆంక్షలు మే 4 నుంచి అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు