Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం

22 Nov, 2022 08:00 IST|Sakshi

జకార్తా: ఇండోనేసియాలోని జావా ద్వీపం సోమవారం భారీ భూకంపం ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. డజన్ల కొద్దీ భవంతులు పేకమేడల్లా నేల మట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భవంతులు కూలిన ఘటనల్లో మొత్తంగా 162 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ జావా గవర్నర్‌ రిద్వాన్‌ కమిల్‌ చెప్పారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. మరణాల సంఖ్య భారీగానే ఉండొచ్చని గవర్నర్‌ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం అందర్నీ కలచివేస్తోంది.

సియాంజుర్‌ పట్టణంలో ఇస్లామిక్‌ బోర్డింగ్‌ స్కూళ్లు, మసీదులు ఎక్కువ. ఇక్కడి ఇస్లామిక్‌ స్కూళ్లలో డే క్లాసులు పూర్తయ్యాక అదనపు క్లాసుల కోసం చాలా మంది విద్యార్థులు స్కూళ్లలోనే ఉండిపోయారు. అదేసమయంలో భూకంపం రావడంతో పాఠశాల భవంతులు కూలి ఎక్కువ మంది చిన్నారులు విగతజీవులయ్యారు. ప్రకంపనల ధాటికి జనం ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు పరుగులుపెట్టారు. చాలా మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు.

కిక్కిరిసిన ఆస్పత్రులు..
జాతీయ విపత్తు దళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమైంది. పెద్ద సంఖ్యలో ఉన్న క్షతగాత్రులను స్థానికులు పికప్‌ ట్రక్కులు, బైక్‌లపై ఆస్పత్రులకు తరలించారు. అధిక జనాభా ఉన్న జావా పట్టణంలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి చేరి భయంతో బిక్కుబిక్కుమంటూ కనిపించారు. ఆగకుండా వస్తున్న క్షతగాత్రులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రోగులను రోడ్లపైనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. ఆరుబయట పార్కింగ్‌ ప్రాంతాల్లోనే చికిత్సచేస్తున్నారు. రక్తమోడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యాలతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఆస్పత్రి, పాఠశాల సహా పలు భవంతులు నేలకూలాయి. ఆస్పత్రి కూలి ఎక్కువ మంది చనిపోయారని వార్తలొచ్చాయి.

సోమవారం మధ్యాహ్నం వేళ రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం పశ్చిమ జావాలోని సియాంజుర్‌ రీజియన్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. సియాంజుర్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ‘మూడుసార్లు భూమి కంపించింది. మొదటిసారి ఆగకుండా పది సెకన్లపాటు కుదిపేసింది’ అని స్థానికురాలు దేవి రిస్మా చెప్పారు.

‘భవంతి ఊగిపోతున్నపుడు 14వ అంతస్థులో ఉన్నాను. మెట్లు దిగి కిందికొచ్చేటపుడు పై ప్రాణాలు పైనే పోయాయి’ అని మహిళా లాయర్‌ మయాదిత చెప్పారు. భూకంపం తర్వాత సైతం 1.8 నుంచి 4 తీవ్రతతో దాదాపు 25 సార్లు ప్రకంపనలు కనిపించాయని ఆ దేశ భూకంపాలు, జియోఫిజిక్స్‌ ఏజెన్సీ తెలిపింది. ఇళ్లు ధ్వంసమై నిరాశ్రయులైన 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిజేదిల్‌ గ్రామంలో శిథిలాల కింద 24 మంది చిక్కుకుని సాయంకోసం అరి్థస్తున్నారు. 27 కోట్ల జనాభా గల ఇండోనేసియాలో భూకంపాలు, అగి్నపర్వతాలు బద్ధలవడం, సునామీలు సర్వసాధారణం. 2004లో హిందూ మహా సముద్రం అడుగున ఏర్పడి విలయం సృష్టించిన భారీ భూకంపం వెనువెంటనే సునామీ ధాటికి 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు

మరిన్ని వార్తలు