ఇండోనేషియాలో వెరైటీ పనిష్మెంట్‌

15 Sep, 2020 12:38 IST|Sakshi

జకర్తా: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం మాస్క్‌ తప్పక ధరించాలి అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. కోవిడ్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటికి నేటికి కూడా కొందరు మాస్క్‌ ధరించడం లేదు. ఈ క్రమంలో ఇండోనేషియా ప్రభుత్వం మాస్క్‌ ధరించని వారిపై జరిమానా విధించడానికి బదులుగా వినూత్న శిక్ష విధిస్తుంది. ఎవరైతే మాస్క్‌ ధరించరో వారు కరోనాతో చనిపోయిన వారిని పూడ్చడానికి గాను సమాధులు తవ్వాలని ఆదేశించింది. ది జకార్తా పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం తూర్పు జావాలోని గ్రెసిక్ రీజెన్సీలో ఎనిమిది మంది బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించకుండా తిరిగారు. వారికి శిక్షగా కరోనాతో చనిపోయిన వారికి సమాధులు తవ్వాలని అధికారులు ఆదేశించారని తెలిపింది. ‘ప్రస్తుతం స్మశాన వాటికలో ముగ్గురు మాత్రమే సమాధులు తవ్వడానికి అందుబాటులో ఉన్నారు. కనుక మాస్క్‌ ధరించని వారికి శిక్షగా ఈ పని అప్పగిస్తే బాగుంటుందని భావించాను’ అని సెర్మ్ జిల్లా అధిపతి సుయోనో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను ఒక సమాధి తవ్వడానికి నియమించారు. వీరిలో ఒకరు సమాధి తవ్వితే.. మరోకరు శవపేటికలో చెక్క బోర్డులను అమర్చుతారు అని తెలిపారు.(చదవండి: మాస్క్‌.. లైట్‌ తీసుకుంటే రిస్కే!)

ఈ వినూత్న పనిష్మెంట్‌ మంచి ప్రభావం చూపించగలదని ఇండోనేషియా అధికారులు భావిస్తున్నారు. రీజెంట్ లా నెంబర్ 22/2020 ప్రకారం, ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా లేదా సమాజ సేవ చేయాలని శిక్ష విధించవచ్చని నివేదిక పేర్కొంది. ఇకపోతే ఇండోనేషియాలో ఆదివారం వరుసగా ఆరవ రోజు 3,000 కి పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో రాజధానిలో సామాజిక దూర పరిమితులను తిరిగి విధించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆదివారం కొత్తగా 3,636 కేసులు నమోదు కాగా.. 73 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,18,382 కు, మరణాలు 8,723 కు చేరుకున్నాయి. 

మరిన్ని వార్తలు