కూలిన విమానం?

10 Jan, 2021 05:09 IST|Sakshi
తమకు దొరికిన శకలాలను చూపుతున్న మత్స్యకారులు

జావా సముద్రంలో పడిఉంటుందని అనుమానాలు

ఇండోనేసియా విమానంలో సిబ్బంది సహా 62 మంది  

జకార్తా: ఇండోనేసియాకు చెందిన ప్రయాణికుల జెట్‌ విమానం ఒకటి ఆచూకీ తెలియకుండా పోయింది. శ్రీవిజయ ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్‌ ప్రావిన్సు రాజధాని పొంటియానక్‌కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే.

జకార్తా– పొంటియానక్‌ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్‌ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్‌ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్‌ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ శకలాలు దానివేనా?
ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్న జకార్తాకు ఉత్తరంగా ఉన్న లంకాంగ్, లాకి ద్వీపాల మధ్య గాలింపు కోసం నాలుగు యుద్ధ నౌకలు సహా 12 ఓడలను ఆ ప్రాంతానికి పంపినట్లు మంత్రి సుమది తెలిపారు. ఆ విమానానివే అని అనుమానిస్తున్న కొన్ని శకలాలు, దుస్తులు జకార్తాకు ఉత్తరంగా ఉన్న థౌజండ్‌ ఐలాండ్స్‌ వద్ద మత్స్యకారులకు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం పంపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.  ‘మత్స్యకారులకు కొన్ని కేబుళ్లు, లోహపు ముక్కలు లభించాయి. సమీపంలో భీకర శబ్ధం, మిరుమిట్లు గొలిపే మెరుపు కనిపించిన కొద్దిసేపటికే వారున్న ప్రాంతంలో నీళ్లలో పడిపోయాయి.

అదే ప్రదేశంలో నీటిపై విమాన ఇంధనం జాడలు  మత్స్యకారులకు కనిపించాయి’ అని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదం వల్లే కూలిందా అనేది నిర్ధారణ చేసుకునేందుకు ఉపయోగపడే అత్యవసర లొకేటర్‌ ట్రాన్స్‌మీటర్‌(ఈఎల్‌టీ) ఎందుకు పనిచేయలేదనే విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. జకార్తా, పొంటియానక్‌ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్న బంధువులు, కుటుంబసభ్యులు, మిత్రులు దైవ ప్రార్థనలు చేస్తున్నట్లు, రోదిస్తున్నట్లు ఉన్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. అతిపెద్ద ద్వీపసమూహ దేశమైన ఇండోనేసియాలో తరచూ రోడ్డు, నౌక, విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
 

మరిన్ని వార్తలు