రక్తపు వరద : యుగాంతం? వైరల్

6 Feb, 2021 15:47 IST|Sakshi

భయపెట్టిన రక్తపు రంగు వరద

యుగాంతం అంటూ నెటిజనుల ఆందోళన

జకార్తా : ఇండోనేషియాలో రక్తపు రంగులో వరద అక్కడి జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. ‘నెత్తుటి వర్షం..యుగాంతం’ అంటూ సోషల్‌ మీడియా ప్రచారం ఊపందుకుంది. ఈ  వరద బీభత్సానికి సంబంధించి వేలాది ఫోటోలు, వీడియోలు ట్విటర్‌లో హల్‌చల్‌ చేశాయి. ఇండోనేషియా సెంట్రల్ జావాలోని పెకలోంగన్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.  

ఇండోనేషియా గ్రామమైన జెంగ్‌గోట్‌లో భారీవర్షాలతో శనివారం వరదలు సంభవించాయి. దీంతో సమీపంలోని బాతిక్ కర్మాగారంలోని  రంగులు వరద నీటిలో కలిసి పోయాయి. ఫలితంగా రక్తాన్ని పోలిన ముదురు  ఎరుపు రంగు వరద నీటిలో కలిసిపోయి గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆందోళనకు దారి తీసింది. ఈ గందరగోళ వాతావరణం నేపథ్యంలో పెకలొంగన్ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ఎర్రరంగు వరద బాతిక్ డై కారణంగా వచ్చిందని, ఆందోళన అవసరం లేదని  విపత్తు నివారణ అధికారి  డిమాస్ అర్గా యుధా  ప్రకటించారు. దీంతో  స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఇండోనేషియాలోని పెకలోంగన్  సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే రంగులకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా బాతిక్ ఫాబ్రిక్  అనే  పెయింట్‌ తయారీకి  పెట్టింది పేరు. ఇక్కడ నదులు వేర్వేరు రంగులను  సంతరించుకోవడం మామూలే. గత నెలలో వరద సమయంలో నగరానికి ఉత్తరాన ఉన్న మరో గ్రామాన్ని ప్రకాశవంతమైన ఆకుపచ్చ నీరు చుట్టిముట్టింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు