ఇన్నిస్‌ఫ్రీ.. చీటింగ్‌ ఫుల్‌!

21 Apr, 2021 19:07 IST|Sakshi

‘ఉప్పర్‌ షేర్వానీ.. అందర్‌ పరేషానీ’ అని ఓ హిందీ సామెత.. సరే తెలుగులో చెప్పుకోవాలంటే.. ‘పైన పటారం.. లోన లొటారం’. పైకి గొప్పగా కనబడ్డా లోపల అంతా డొల్లేనని వీటి అర్థం. దక్షిణ కొరియాకు చెందిన ఇన్నిస్‌ఫ్రీ అనే కాస్మెటిక్స్‌ కంపెనీకి ఇలాంటి ముచ్చట తెలిసినట్టు లేదు. తెలిసీ తెల్వకనో, కావాలనో గానీ ఆ కంపెనీ చేసిన ఓ పని మాత్రం పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ కంపెనీ ఓ గ్రీన్‌టీ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఈ మధ్యే విడుదల చేసింది. పర్యావరణ హితంగా ఉండేలా పేపర్‌ బాటిల్‌లో ప్రొడక్ట్‌ తెస్తున్నామని ప్రకటించింది. అంతేకాదు.. ఆ బాటిల్‌పై ‘హలో, ఐయామ్‌ పేపర్‌ బాటిల్‌’ అని కూడా పెద్దగా ప్రింట్‌ చేసింది.

అసలే ఈ మధ్య పర్యావరణ పరిరక్షణపై కాస్త ఇంట్రెస్ట్‌ చూపిస్తున్న జనం ఆ ప్రొడక్ట్‌ను బాగానే కొన్నారు. తీరా చూస్తే.. ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌కే కాస్త మందంగా ఉన్న పేపర్‌ ప్యాకింగ్‌ చేసి ఉండటం గమనించి గొల్లుమన్నారు. ఇదేం మోసమంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన కంపెనీ.. ‘‘అసలు మా ఉద్దేశం వేరు. ఇంతకుముందటి ప్రొడక్ట్‌ కంటే సగమే ప్లాస్టిక్‌ ఉండేలా తయారు చేశాం. కానీ జనం మొత్తం పేపర్‌ బాటిల్‌ అనుకున్నట్టున్నారు. మేం పెట్టిన పేరు కన్ఫ్యూజ్‌ చేసినట్టుంది..’’ అని సర్ది చెప్పుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు