చంద్రుడిపై ఆధిపత్యం.. ప్రపంచ దేశాల మూన్‌ రేస్‌!

14 May, 2023 09:14 IST|Sakshi

జాబిల్లిపై ఆధిపత్యం కోసం తీవ్రమవుతున్న పోటీ

ప్రయోగాల కోసం వడివడిగా కసరత్తు

అకస్మాత్తుగా అనేక దేశాల దృష్టి జాబిల్లిపైకి మారింది. చందమామపై ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోటీ మొదలైంది. 50 ఏళ్ల క్రితమే జాబిల్లిపై తొలి అడుగు వేసిన అమెరికా  మొదలు ఇప్పటివరకు ఒక్క రాకెట్‌ కూడా ప్రయోగించని సౌదీ అరేబియా వరకు ఎన్నో దేశాలు మూన్‌ రేస్‌కు సిద్ధమయ్యాయి. చందమామపై ఉన్న అపార ఖనిజ నిక్షేపాలు, నీటి జాడలను సొంతం చేసుకోవడంతోపాటు భవిష్యత్తులో వాణిజ్య స్థాయిలో పర్యాటక అభివృద్ధి నుంచి ఆవాసాల ఏర్పాటు వరకు అక్కడి ఉపరితలంపై ముందుగా పాగా వేయాలని తహతహలాడుతున్నాయి. ఈ దిశగా ఏయే దేశాలు ఎలాంటి ప్రయత్నాలు  సాగిస్తున్నాయో ఓ లుక్కేద్దాం. 

దొడ్డ శ్రీనివాసరెడ్డి: చందమామపై ఆధిపత్యం కోసం జరుగు­తున్న పోటీలో అందరికన్నా చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (కన్సా) ముందుంది. చాంగ్‌–3, 4, 5 మిషన్‌లతో చంద్రుని ఉపరితలంపై కబ్జా పెడుతోంది! ఈ దశాబ్దం చివరికల్లా చంద్రునిపై అడుగుమోపాలని చైనీయులు తహతహలాడుతున్నారు. 2030 నాటికి చైనా వ్యోమగాములు జాబిల్లిపై అడుగుపెట్టడం తథ్యమని చైనా చంద్రయాన్‌ కార్యక్రమ అధిపతి వువీరెన్‌ ఢంకా భజాయించి చెబుతున్నారు.

వ్యోమగాములు చంద్రునిపై దిగడానికి ఉపయోగించే పరికరాల తయారీలో ఎంతో ముందంజ సాధించామని ఆయన చెప్పారు. వ్యోమగాములను తీసుకెళ్లే అత్యాధునిక రాకెట్‌ను, అంతరిక్షనౌకను చైనా సిద్ధం చేసుకుంటోంది. కొత్త తరం రాకెట్‌ తొలి ప్రయోగం 2027లో నిర్వహించాలని, 2030 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి పంపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

అంతేకాదు వ్యోమగాములు కొంతకాలంపాటు చంద్రునిపై గడిపేందుకు వీలుగా చిన్నపాటి స్పేస్‌స్టేషన్‌ నిర్మాణానికి కూడా సిద్ధమవుతోంది. చంద్రునిపై ఉన్న మట్టి సాయంతో ఇటుకల తయారీకి అవసరమైన త్రీడీ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది. మొత్తం ప్రాజెక్టులో అమెరికా వంటి దేశాలు భాగస్వామ్యాన్ని కూడా చైనా ఆహ్వానిస్తోంది. 

అమెరికా తహతహ..
చైనాకన్నా ముందే చంద్రునిపై ఆధిపత్యాన్ని నెలకొల్పాలని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. డొనాల్డ్‌ట్రంప్‌ అధ్యక్షునిగా ఉన్నప్పుడే చంద్రుడిపై దృష్టి పెట్టమని నాసాను కోరారు. దీంతో యాభై ఏళ్ల తరువాత మళ్లీ చంద్రునిపై అడుగు పెట్టేందుకు నాసా కృతకృత్యమైంది. ఆర్టీమిస్‌ పేరిట ఓ సుదీర్ఘ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే నాసాకి చెందిన ఓరియాన్‌ అంతరిక్ష నౌక చంద్రుని చుట్టూ తిరిగి భూమిమీదకు చేరింది.

రెండో మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన అంతరిక్షనౌక చంద్రుడిని ప్రదక్షిణ చేసేందుకు నాసా సన్నద్ధం అవుతోంది. 2025 నాటికి చంద్రునిపై వ్యోమగాములు అడుగు మోపేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించింది. ఇద్దరు వ్యోమగాములు అందులో ఒకరు మహిళ, మరొకరు రంగు జాతికి చెందిన వ్యక్తి చంద్రునిపై కాలుమోపేలా నాసా వ్యూహరచన చేసిం­ది. ఈ బృహత్తర కార్యక్రమం కోసం స్పేస్‌ఎక్స్, బోయింగ్, లాక్‌హీడ్‌ మార్టీన్‌లతో నాసా జతకట్టింది.

యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఐఎస్‌ఎ) ఏకంగా చంద్రుడిపై రోబోల సాయంతో ఓ గ్రామాన్ని నిర్మించాలనే సంకల్పంతో ప్రణాళికలు రచిస్తోంది. స్పేస్‌ఎక్స్‌ ఓ వైపు నాసా కోసం పనిచేస్తూనే మరోవైపు ప్రయాణికుల్ని చంద్రునిపైకి తీసుకువెళ్లే వాణిజ్యపరమైన యాత్రలకు శ్రీకారం చుట్టే వ్యూహాన్ని రూపొందిస్తోంది. మరోవైపు అమెజాన్‌ అధిపతి జెఫ్‌బెజోస్‌ చంద్రునిపైకి సరుకులు రవాణా చేసే కార్గో రాకెట్ల రూపకల్పన కోసం బ్లూమూ­న్‌ పేరిట మిషన్‌కు రూపకల్పన చేస్తున్నారు. 

స్పేస్‌ జామ్‌! 
వచ్చే పదేళ్లలో అన్ని దేశాలు, సంస్థలు కలిసి కనీసం 100 వరకు చంద్రయాన్‌లు నిర్వహించనున్నాయి. దీంతో భూమికి చంద్రునికి మధ్య విపరీతమైన రద్దీ ఏర్పడనుంది.! భూమి–చంద్రుడి మధ్యభాగాన్ని సిస్‌లూనార్‌ అని పిలుస్తారు. వ్యోమగాములను పంపడం, చంద్రుడిపై స్పేస్‌ స్టేషన్‌ నిర్మించడం, రోబోలతో కాలనీ నిర్మించడం వంటి అనేక కార్యక్రమాల కారణంగా సిస్‌లూనార్‌ మొత్తం రాకెట్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల ప్రయోగాలతో బిజీగా మారనుంది! సిస్‌లూనార్‌ స్పేస్‌లోని కొన్ని కక్ష్యలకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఆక్రమించడానికి కూడా విపరీతమైన పోటీ ఏర్పడనుంది.

సాంకేతిక అభివృద్ధి కారణంగా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గిపోయింది. భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా వివిధ దేశాలు, సంస్థల మధ్య పోటీ పెరిగిపోయి త్వరలో స్పేస్‌జామ్‌కు కారణం కాబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం ఇటీవల సిస్‌లూనర్‌ స్పేస్‌ని అందరూ శాంతియుతంగా బాధ్యతాయుత, సుస్థిర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉపయోగించుకోవాలని కోరింది. 

రేసులో ఇతర దేశాలు
భారత్‌: చంద్రయాన్‌–2 మిషన్‌ విఫలమైనా  చంద్రయాన్‌–3 ప్రయోగానికి సిద్ధమవుతోంది. 
యూఏఈ: రషీద్‌ రోవర్‌ను చంద్రునిపై  దింపడానికి సకల ఏర్పాట్లు చేసుకుంటోంది. 
జపాన్‌: ప్రైవేటు సంస్థ ఐస్పేస్‌ చిన్నసైజు అంతరిక్షనౌక హకుతోఆర్‌ను జాబిల్లిపై దించే ప్రయత్నాల్లో ఉంది. అది గనుక విజయవంతమైతే చంద్రునిపైకి అంతరిక్షనౌకను దింపిన తొలి ప్రైవేటు కంపెనీ కాగలదు. 
ఇజ్రాయెల్‌: ప్రైవేటు సంస్థ చంద్రునిపై అడుగుపెట్టడానికి ప్రయోగించిన తొలి బెరిసీట్‌ మూన్‌ మిషన్‌ విఫలమైంది. రష్యా, యూరప్, దక్షిణ కొరియా సైతం వివిధ స్థాయిల్లో చంద్రుడిని చేరేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. 
స్పేస్‌ ఎక్స్‌: మూన్‌రేస్‌లో ప్రభుత్వాలే కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఎలాన్‌మస్‌్కకు చెందిన స్పేస్‌ఎక్స్, జెఫ్‌బ్రెజోస్‌కు చెందిన బ్లూ ఓరియన్‌ లాంటి పెద్ద ప్రైవేటు స్పేస్‌ సంస్థలతోపాటు వివిధ దేశాలకు చెందిన అనేక చిన్న, పెద్ద ప్రైవేటు సంస్థలు కూడా పోటీలోకి దిగాయి. 

చంద్రుడు ఎవరివాడు? 
అంతరిక్షాన్ని ఎవరి స్వప్రయోజనాలకు వాడుకోకుండా, మానవాళి మనుగడకు ఉపయోగించుకోవాలనే ఒప్పందంపై 1967లో 110 దేశాలు సంతకాలు చేశాయి. అలాగే అంతరిక్షాన్ని శాంతియుతంగా, పారదర్శకంగా ఉపయోగించుకోవడం కోసం అమెరికా, మరికొన్ని దేశాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు చంద్రుడి విషయంలో మాత్రం అనేక దేశాలు తమ భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకొనేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి.  

చంద్రుని దక్షిణ ధ్రువాన్ని గుప్పిట్లోకి  తీసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది.  అందుకే మేము మరోసారి చంద్రుడుపైకి  వెళ్లడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. ఈసారి
అంతర్జాతీయ, వాణిజ్య భాగస్వాములతో కలసి జాబిల్లిపైకి అడుగుపెడతాం.  – నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌నెల్సన్‌  

ఒకప్పుడు చంద్రయానాన్ని దేశ గౌరవంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత ప్రయోజనాల కోసం దేశాల మధ్య పోటీ ఏర్పడింది.  – ఏరోస్పేస్‌ సెక్యూరిటీ  ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్‌ కెతెలిస్‌ జాన్సన్‌  

మరిన్ని వార్తలు