International Dance Day 2022: కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు..

29 Apr, 2022 10:50 IST|Sakshi

సినిమా పాటలే కాదు.. ఈమధ్య లోకల్‌ బీట్స్‌ కూడా హుషారుగా జనాలతో గంతులేయిస్తున్నాయి. అందుకు సోషల్‌ మీడియా కారణం అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌ షార్ట్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌.. ఇలా షార్ట్‌ వీడియో యాప్స్‌ ద్వారా ఆ బీట్‌లు దేశం దాటి విదేశాలకు చేరిపోతున్నాయి. ప్రత్యేకించి స్టెప్పులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డే(ఏప్రిల్‌ 29). ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో అలా వైరల్‌ అయిన కొన్ని పాటలపై లుక్కేద్దాం. 


అరబిక్‌ కుతు.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన బీస్ట్‌ చిత్రంలోని సాంగ్‌. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సాంగ్‌ యూట్యూబ్‌ రికార్డులతో పాటు సోషల్‌ మీడియాలో ఓ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అనిరుధ్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌కు లిరిక్స్‌ హీరో శివకార్తికేయన్‌ రాయగా, అనిరుధ్‌-జోనితా గాంధీ కలిసి పాడారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన స్టెప్పులు మాత్రం ఉర్రుతలూగించాయనే చెప్పాలి.

నాటు నాటు  దేశంలోని యావత్‌ సినీ ‍ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి డైరెక్షన్‌, మల్టీస్టారర్‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. వాటిని అందుకుంటూ దాదాపు అన్ని భాషలలో భారీ విజయమే అందుకుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్‌.. కీరవాణి కంపోజిషన్‌కి కాల భైరవ, రాహుల్‌ సిప్లీగంజ్‌లు గాత్రం అందించారు. ప్రేమ రక్షిత్‌ కంపోజ్‌ చేసిన నాటు స్టెప్పులకు తారక్‌, రామ్‌ చరణ్‌ల అడుగులు తోడై.. ఆడియొన్స్‌తో ఈలలు వేయించాయి. 

ఇది కూడా చదవండి: ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్‌, ఆచార్య బయటపడేనా?


శ్రీవల్లి సాంగ్‌ తగ్గేదే లే అంటూ దేశం మొత్తం పుష్పమేనియాతో ఊగిపోయింది చాలాకాలం. రగ్గుడ్ లుక్‌లో బన్నీ స్టయిల్‌, ముఖ్యంగా డైలాగులు పుష్ప కు భారీ విజయాన్ని కట్టబెట్టాయి. ఇంకోవైపు ఈ సినిమాలోని పాటలు కూడా భాషలకతీతంగా ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించాయి. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌లో పుష్పరాజ్‌ వేసిన స్టెప్పులు ఖండాంతరాలు దాటి.. క్రీడాకారులు, ఇతర సెలబ్రిటీలు అనుకరించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

అడిపోలి.. మ్యూజికల్‌ ఆర్టిస్ట్‌ సిద్ధూ కుమార్‌ కంపోజ్‌ చేసి.. డైరెక్ట్‌ చేసిన మలయాళం సాంగ్‌ ‘అడిపోలి’. వినీత్‌ శ్రీనివాసన్‌, శివాంగి అందించిన గాత్రం.. ట్రెడిషనల్‌ సెట్స్‌లో అదిరిపోయే బీట్స్‌తో కిందటి ఏడాదిలోనే రిలీజ్‌ అయిన ఈ సాంగ్‌ బాగా ఫేమ్‌ అయ్యింది.

కచ్చాబాదామ్‌ .. పచ్చి పల్లీలు అమ్ముకునే పశ్చిమ బెంగాల్‌ వాసి ‘భూబన్‌ బద్యాకర్‌’ కచ్చా బాదామ్‌ అంటూ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ పాట రీమిక్స్‌ దెబ్బకు భూబన్‌ జీవితం మారిపోవడంతో పాటు ఆ పాట ఇవాళ్టికి క్రేజ్‌ తగ్గట్లేదు.. ఇంకా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే ఉంది. పైగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అంజలీ అరోరా హాట్‌ స్టెప్పులనే ప్రతీ ఒక్కరూ ఫాలో అయిపోతున్నారు. 

మోడ్రన్‌ బ్యాలె డ్యాన్స్‌ సృష్టికర్త జీన్‌ జార్జెస్‌ నోవెర్రే జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. యూనెస్కో సహకారం, డాన్స్‌ కమిటీ ఆఫ్‌ ది ఇంటర్నేషన్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ ‘ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డే’ను ఘనంగా నిర్వహిస్తుంటుంది. నృత్యంలో పాల్గొనడం, నృత్య విద్యను ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం. నృత్యాన్ని ఒక కళ రూపంగా గుర్తించడంతో పాటు అందులోని వైవిధ్యాన్ని, అందాన్ని మరింత ప్రదర్శించేలా డ్యాన్స్‌ డేను నిర్వహిస్తుంటారు.

చదవండి: కన్నడలో లక్‌ పరీక్షించుకోనున్న కమెడియన్‌

మరిన్ని వార్తలు