International Day Of Girl Child: గుడ్‌-బ్యాడ్‌ టచ్‌! పేరెంట్స్‌.. సిగ్గు వీడండి, పిల్లలకు ఆ తేడాలు చెప్పండి

11 Oct, 2021 08:18 IST|Sakshi

International Day of the Girl Child 2021: చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు.. ఈ వార్తలు విన్నప్పుడల్లా రగిలిపోతుంటాం. ‘అయ్యో చిట్టితల్లి’ అని కొందరు బాధపడిపోతుంటే.. ‘ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాల’ని డిమాండ్లు చేస్తుంటారు మరికొందరు. ఇంకొందరి వల్ల రకరకాల వాదనలు-చర్చలు తెర మీదకూ వస్తుంటాయి కూడా. సైదాబాద్‌ ఘటన అయితేనేం, లవ్‌స్టోరి సినిమాలో చూపించినట్లు అయితేనేం.. రియల్‌ నుంచి రీల్‌ లైఫ్‌ దాకా అంతటా ఈ ఇష్యూ తీవ్రతను తెలియజేశాయి.  బయటికి వచ్చేవి కొన్నే. అసలేం జరుగుతుందో అర్థంకాక, ఎవరికి ఎలా చెప్పాలో తెలియక పిల్లలు కుంగిపోతున్నారు. ఈ తరుణంలో ‘గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌’ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం తప్పనిసరి అంటున్నారు మానసిక నిపుణులు. 

► అక్టోబర్‌ 11.. అంటే ఇవాళ ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ది గర్ల్‌ చైల్డ్‌’.. అమ్మాయిల హక్కులు, భద్రత, విద్యావకాశాలు.. పై దృష్టిసారించాలని చాటిచెప్పే రోజు .

► వరల్డ్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ వుమెన్‌.. ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ది గర్ల్‌ చైల్డ్‌’ నిర్వహణకు నాంది వేసింది.  బీజింగ్‌ కాన్ఫరెన్స్‌-1995లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

► 2012 అ‍క్టోబర్‌ 11 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు.

► లింగ వివక్షను దూరం చేస్తూ.. అమ్మాయిలకు భవిష్యత్‌ అవకాశాల్ని ఎలా అందిపుచ్చుకోవాలి? పోటీ ప్రపంచంలో ఎలా రాటుదేలాలో అవగాహన కల్పించాలని చెబుతుంది ఈ రోజు. 

శారీరక కోరికలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు..  ఇతరుల శరీరాన్ని ముట్టుకోవడం ద్వారా వెకిలి చేష్టలకు పాల్పడుతుంటారు కొందరు. పిల్లలను చెడు ఆలోచనలతో తాకడం కూడా ఈ కోవకే చెందింది.  చూసేవాళ్లకు ఇది మాములుగానే అనిపించొచ్చు.  కాస్త ఎదిగిన పిల్లలకు తాకే వ్యక్తుల మనస్తతత్వం తేలికగానే అర్థమైపోతుంది. కానీ, చిన్న వయసులో అది అర్థం కాకపోవచ్చు. ఇంట్లో వాళ్ల లాగే ప్రేమతో వాళ్లు ముట్టుకుంటున్నారనుకుంటారు. అందుకే అనురాగంతో తాకటం, కోరికలతో తాకటం మధ్య తేడాల్ని పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు. 
 

ఖచ్ఛితంగా తెలుసుకోవాలి
‘తన తండ్రి భుజాల మీద చేయి వేసినప్పుడు కలిగే స్పర్శ తన రక్షణ కోరుతుంది. కానీ, ఎవరైనా దురుద్దేశంతో  తాకినప్పుడు ఆ స్పర్శ ఎలాంటిదో తెలుసుకోవాలి.  ఒక్కోసారి సొంతవాళ్ల నుంచే  లైంగిక వేధింపులు ఎదురుకావొచ్చు!. బెదిరించో, భయపెట్టో పదేపదే అఘాయిత్యాలకి పాల్పడొచ్చు. అందుకే గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌ల మధ్య తేడాల్ని పిల్లలకు చెప్పాలి.  తమను తాము రక్షించుకోవడానికి పిల్లలకూ అవకాశం కల్పించాలి. అదే టైంలో పిల్లల ప్రవర్తనను గమనిస్తూ.. వాళ్లకు అలాంటి ఇబ్బందులు ఏవైనా ఎదురవుతున్నాయా? అని తెలుసుకోవడంతో పాటు వాళ్లలో ధైర్యమూ నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది.


పిల్లలకు గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌ల మధ్య తేడాను తెలియజేయాలి
 అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్పించాలి
మొహమాటం అనిపిస్తే తల్లిదండ్రులూ కౌన్సిలింగ్‌ తీసుకోవచ్చు  
తమ పిల్లలు లైంగిక వేధింపులకు గురైతే..  చట్టపరంగా ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరమూ ఉంది 
టీచర్లు సైతం పిల్లల మానసిక పరిస్థితి పరిశీలిస్తూ ఉండాలి.. అవసరమైతే ఇందుకోసం శిక్షణ తీసుకోవాలి

International Girl Child Day.. ఈ ఇయర్‌ థీమ్‌ ‘డిజిటల్‌ జనరేషన్‌.. అవర్‌ జనరేషన్‌’. 

ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది.. అదీ 25 ఏళ్లలోపు ఇంటర్నెట్‌ సౌకర్యానికి దూరంగా ఉంటున్నారు. వీళ్లలో అమ్మాయిల శాతం ఎక్కువగా ఉంది. జెండర్‌-డిజిటల్‌ డివైడ్‌ను సూచించేదిగా ఉన్నాయి ఈ గణాంకాలు.  అందుకే సాంకేతికంగా అమ్మాయిలు రాణించాలని, అందుకు అవసరమైన తోడ్పాడు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని చాటి చెప్పడం ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌​ ది గర్ల్‌ చైల్డ్‌ థీమ్‌. 


పేరెంట్స్‌ బ్రెయిన్‌వాష్‌

లైంగిక వేధింపులకు గురయ్యే బాలికను త్వరగా గుర్తించొచ్చు. మానసికంగా వాళ్లలో మార్పులొస్తాయి. ఇంట్లోవాళ్లతోనే కాదు.. సొసైటీతోనూ డిటాచ్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తారు. నిద్రలో కలవరపాటుకు గురవుతుంటారు. సరిగా తినకపోవడం, భయాందోళనలు పెరిగిపోవడం గమనించొచ్చు.  అందుకే పిల్లలు తమను తాము రక్షించుకునే ధైర్యం తెచ్చుకోవాలి. ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలనేది నేర్చుకోవాలి.  బహిరంగ ప్రదేశాల్లోనూ తమ శరీర భాగాల్ని ఎవరైనా తాకడం చేస్తే.. వారు భయాందోళనకు గురికాకుండా గట్టిగా తిరస్కరించాలి. తమకు నమ్మకస్తులైన పెద్దవారెవరైనా దగ్గరలో ఉంటే విషయాన్ని వివరించాలి. లేదా తల్లిదండ్రులకైనా ఆ విషయం చెప్పాలి. అలాగనుక జరిగితే నేరస్తుడు తప్పించుకోలేడు. మరిన్ని అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. మరి ఇదంతా పిల్లలకు చెప్పాల్సింది ఎవరు? ఇంకెవరు తల్లిదండ్రులు, ఇంట్లోవాళ్లు, టీచర్లే. వేధింపులకు గురైన పిల్లలకు మానసిక వైద్యుల ద్వారా ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలి.  గతాన్ని మరచిపోయి వారి జీవితంలో చీకట్లను పారదోలాలి. 

ఈరోజుల్లో పిల్లలపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులోకి రాగానే.. ‘న్యాయం’ పేరిట బాధితురాలి ఫొటోల్ని, వీడియోల్ని సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేసేస్తున్నారు కొందరు. అయితే పోక్సో చట్టం ప్రకారం.. పేర్లతో సహా వాళ్ల ఐడెంటిటీకి సంబంధించి ఎలాంటి వివరాల్ని ప్రదర్శించినా అది నేరమే అవుతుంది!


దేశంలో ఫస్ట్‌ టైం.. 

స్కూల్‌  దశలోనే పిల్లలకు ‘గుడ్‌ టచ్‌- బ్యాడ్‌ టచ్‌’ పేరిట అవగాహన కల్పించేందుకు (బొమ్మల పాఠాల రూపంలో) గుజరాత్‌లోని వడోదర పోలీసులు నడుం బిగించారు. మూడేళ్ల క్రితం అప్పటి సిటీ డీసీపీ సరోజ్‌కుమారి, డిపార్ట్‌మెంట్‌లో పని  చేసే 12 మంది మహిళా పోలీసులతో ‘సమాజ్‌ స్పర్శ్‌ కీ’ (ఎస్‌ఎస్‌కే)అనే గ్రూప్‌ని ఏర్పాటు చేశారు. గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ గురించి దేశంలో ఈ తరహా పాఠాలు పిల్లలకు చెప్పే కార్యక్రమం ఇదే మొదటిది! అలా మూడేళ్లుగా వీళ్ల కృషి కొనసాగుతోంది.

- సాక్షి, వెబ్‌ స్పెషల్‌

మరిన్ని వార్తలు