International Day of Peace 2021: ఈ ఏడాది థీమ్‌ ఏంటి?

21 Sep, 2021 11:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా శాంతియుత జీవనం గడపాలనే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ 1981వ సంవత్సరంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయంగా ఘర‍్షణలు తొలగిపోయి శాంతియుత సమాజం నిర్మాణమే లక్ష్యంగా శాంతి దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది.

సెప్టెంబర్ మూడో మంగళవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరపాలని 1981లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించినా ఆ తరువాత 2001లో సెప్టెంబర్ 21 తేదీన నిర్వహించాలని ఐరాస నిర్ణయించింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా అహింస, కాల్పుల విరమణ దినోత్సవంగా నిర్వహించింది. అది మొదలు ప్రతీ ఏడాది ఏదో ఒక థీమ్‌తో అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో 2021 అంతర్జాతీయ శాంతి దినోత్సవం థీమ్: సమాన, సుస్థిరమైన  ప్రపంచం కోసం వేగంగా కోలుకోవడం (Recovering Better for an Equitable and Sustainable World)

ప్రస్తుతం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అహింస నెలకొంది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌లో ఇటీవలి సంక్షోభంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేక రకాల హింసను అనుభవిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక హింస, అనిశ్చితి కారణంగా పౌరుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలముకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి స్థాపన అనేది కలగా మారుతోంది. హింసాత్మక, వినాశకర సంఘర్షణలను నివారించడమే  కాకుండా దాన్ని పరిష్కరించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మరోవైపు కరోనా మహమ్మారి ప్రపంచ పరిస్థితులను తల్లకిందులు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది థీమ్‌ను వేగంగా కోలుకోవడం అనే అంశాన్ని ప్రధానంగా  తీసుకోవడం  గమనార్హం.

కరోనా మహమ్మారి అంతమైపోవాలని ప్రతిన బూనుదాం. పూర్తి ఆరోగ్యమైన ప్రపంచాన్ని కలగందాం. అలాగే మనుషులందరూ మానవత్వమున్న పౌరులుగా మారాలని, మానవ విలువలకు పెద్ద పీట వేస్తూ, పొరుగువాడిని ప్రేమిస్తూ జీవించాలని కోరుకుందాం.  శాంతియుత  ప్రపంచాన్ని కోరుకుందాం.


‘శాంతి చిరునవ్వుతో మొదలవుతుంది’- మదర్ థెరిస్సా

‘‘న్యాయస్థానాల కంటే ఉన్నత న్యాయస్థానం మనస్సాక్షి. ఇది అన్ని ఇతర కోర్టులకంటే చాలా ఉన్నతమైంది" - మహాత్మా గాంధీ

ఈ సంవత్సరం ప్రపంచ శాంతి సగటు స్థాయి 0.07 శాతం క్షీణించింది. గత పదమూడు సంవత్సరాలలో వరుసగా ఇది తొమ్మిదవ క్షీణత. ఈ విషయంలో 87 దేశాలు మెరుగుపడుతుంటే  73  దేశాలు రికార్డ్‌ స్థాయిలో క్షీణిస్తున్నాయి.

ఐస్‌ల్యాండ్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశం.  ఈ విషయంలో 2008 నుండి తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. 
యూరప్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన ప్రాంతంగా ఉంది. 
న్యూజిలాండ్, డెన్మార్క్, పోర్చుగల్,  స్లోవేనియా  3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి.
అఫ్గానిస్తాన్ వరుసగా నాలుగో సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్దఅశాంతి దేశంగా నిలుస్తోంది.
ప్రపంచం అత్యంత శాంతియుతంలో దేశాల ర్యాంకులో భారత్‌ 135 స్థానంలో ఉంది.
దక్షిణ ఆసియాలో అత్యంత ప్రశాంతమైన దేశం భూటాన్‌.

మరిన్ని వార్తలు