Sign Language Day: ‘మాకు మాటలు వచ్చు.. అయినా ఇలాగే బతుకుతాం’

23 Sep, 2021 11:10 IST|Sakshi
అలీపూర్‌లో.. (ఫైల్‌ ఫొటో)

International Day of Sign Languages: మనిషి అవిటితనం.. ప్రయత్నాలకు, విజయాలకు అడ్డుపడదనే విషయాన్ని ఎన్నో వ్యథలతో కూడిన కథలు నిరూపించాయి.. ఇంకా నిరూపిస్తున్నాయి కూడా.  బధిరులు తమ మధ్య సంభాషణల కోసం..  సైగల భాషను ఉపయోగించుకుంటారు కదా!.  అలాంటి ప్రత్యేక భాషల కోసం సెప్టెంబర్‌ 23ను ఇంటర్వేషనల్‌ సైన్‌ లాంగ్వేజెస్‌ డేగా నిర్వహిస్తోంది వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డెఫ్‌.  ఇంటర్నేషనల్‌ వీక్‌ ఆఫ్‌ ది డెఫ్‌లో భాగంగా.. 2018 నుంచి ఈ డేని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది. 


రోజూవారీ జీవితంలో బధిరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం.. వాళ్లను స్వాంతన అందించడం సైగల భాషల అంతర్జాతీయ దినోత్సవ ఉద్దేశం. అయితే అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లు.. ఇలాంటి సైగల భాషను ఉపయోగించాలనుకోవడం మాత్రం ప్రత్యేకమైన విషయమే.  బధిరుల భాషను తమ భాషగా అలవర్చుకున్న ఊళ్లు..  ఈ భూమ్మీద ఓ పాతికకు పైనే ఉన్నాయని తెలుసా?.. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం..

అలీపూర్‌..
సైగల ద్వారా మాట్లాడుకునే భారత గ్రామం అలీపూర్‌!. కర్ణాటకలోని ఈ ఊరిలో ప్రస్తుతం బధిరుల సంఖ్య రెండువందలకు పైనే.  అయితే ఒకప్పుడు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండేది.  పదేళ్ల క్రితం ఇక్కడ డెఫ్‌ సొసైటీని ఏర్పాటు చేయించి..  స్థానికులకు సైగల భాషను మిగతా వాళ్లను అలవాటు చేయించారు.  అలా బధిరులు కానీవాళ్లు సైతం కమ్యూనికేషన్‌ కోసం సైగల భాషను అలవర్చుకున్నారు అక్కడ.  గత జనాభా లెక్కల ప్రకారం.. పాతికవేలకు పైగా అలీపూర్‌లో పదివేలకు పైగా సాధారణ జనం సైగల భాషను ఉపయోగించేవాళ్లు. ఇక ఈ  ఊళ్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం ఏంటంటే.. చెవులు వినిపించని వాళ్లు పరస్పరం వివాహం చేసుకోకూడదు!. అయితే ఇప్పటితరాలు మాత్రం ఈ భాషను నేర్చుకోవడానికి ఎందుకనో అంతగా ఆసక్తి చూపించడం లేదు మరి!. ఇక నాగాలాండ్‌లోని నానా బిన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ను సైతం నాగా హిల్స్‌లోని ప్రజలు మాట్లాడుతుంటారు.

 
We Sign For Human Rights.. ఈ ఏడాది International Day of Sign Languages 2021 ఇచ్చిన థీమ్‌
 


కటా కొలోక్‌

ఈ ఊళ్లో ప్రజలు బింకల సైన్‌ లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తారు.  ఇండోనేషియా ఉత్తర బాలి రీజియన్‌లో పక్కపక్కనే ఉండే రెండు ఊళ్ల ప్రజలు ఏడు తరాలుగా ఈ సైగల భాషను ఉపయోగిస్తున్నారు. జనాభా 3,000 అయితే.. బధిరుల సంఖ్య నలభై లోపే ఉంది. అయితే ఇక్కడ నివసించే బధిరులు..  తమ అవిటితనాన్ని దైవత్వంగా కొలుస్తుంటారు.  ప్రత్యేకంగా బతుకుతుంటారు. అందుకే మామూలు జనం కూడా ఈ భాషను గౌరవిస్తూ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ భాష అందరికీ ఒకేరకంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.  అందుకే కమ్యూనికేషన్‌ కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. అయినా కూడా పవిత్రత కారణంగా కటా కొలోక్‌ను ఇప్పటికీ ఉపయోగిస్తుంటారు అక్కడి జనాలు. 


ఎడాస్ల్‌..
ఘనా తూర్పు ప్రాంతంలో ఉండే కుగ్రామం. ఎడామోరోబ్‌ సైగల భాష ఇక్కడ పాపులర్‌.  తమ ఊరిలో బధిరుల కోసం అక్కడి స్థానికులు రూపొందించుకున్న భాష ఇది. వంశపారంపర్యంగా కొనసాగుతూ వస్తోంది. ఘనాలో బధిరుల కోసం రూపొందించిన ఘనానియన్‌ సైగల భాషను మించి  ప్రత్యేకంగా ఉంటుంది ఇది. కల్చర్‌కు ప్రాధాన్యం ఉండడంతో చాలా విశిష్టతను సంతరించుకుంది. అయితే డెఫ్‌ కమ్యూనిటీ సైతం దీనిపై ఆసక్తి చూపిస్తుండకపోవడంతో.. దాదాపు అంతరించిపోయే స్టేజ్‌కు చేరుకుంది ఎడాస్ల్‌ సైగల భాష.


ఛాటినో సైన్‌ 
మెక్సికో ఓవాక్సాకా రాష్ట్రం శాన్‌ జువాన​ క్యూయియాషీలోని ఛాటినో గ్రామాల్లో ఛాటినో సైగల భాష పాపులర్‌. మెక్సికన్‌ సైగల భాషతో ఏమాత్రం సంబంధం లేనిది ఈ భాష. నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌, హెల్త్‌ ఫౌండేషన్‌లు ఈ భాషను 2014లో రూపొందించాయి. బధిరులు చాలా తక్కువ మంది అలవాటు చేసుకున్న ఈ భాషను.. మిగతా స్థానికులు ఎందుకు అలవర్చుకున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కదు.

మార్తాస్‌ విన్‌యార్డ్‌
మసాచుసెట్స్‌(యూఎస్‌ స్టేట్స్‌) లోని ఒంటరి ఐల్యాండ్‌ మార్తాస్‌ విన్‌యార్డ్‌. ఇక్కడుండేవాళ్లలో మెజార్టీ బధిరులే. వంశపారంపర్యంగా పిల్లలు అలా పుడుతూనే వస్తున్నారు. ఒకప్పుడు అక్కడ పుట్టే నలుగురు పిల్లలో ఒకరు బధిరులే అని లెక్కలు చెప్తున్నాయి.  అయితే మార్తాస్‌ విన్‌యార్డ్‌ సైగల భాషను మొదట్లో తిరస్కరించారు. అందుకు కారణాలు.. ఆ సైగల్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నవాళ్లు ఎవరూ లేకపోవడం. అమెరికా సైన్‌ లాంగ్వేజ్‌ను నేర్పించే ప్రయత్నం.  అయినప్పటికీ తాతల కాలం నుంచి వస్తున్నది కావడంతో కొందరు బలవంతంగా అయినా ఈ భాషను అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.   

బధిరుల కంటే సాధారణ ప్రజలే సైగల భాషను ఎ‍క్కువగా ఉపయోగిస్తున్న ప్రాంతాలను పరిశీలిస్తే..  ఇజ్రాయెల్‌(అల్గేరియా)లో ఘర్దాయియా సైగల భాష, కెనెడా ఇన్‌యూయిట్‌, బ్రెజిల్‌ కా అపూర్‌, న్యూగినియా కైయిల్గే, టర్కీ మర్దిన్‌, ఇంగ్లండ్‌ ఓల్డ్‌ కెంట్‌, మాలి టెపుల్‌.. ఇంకా మరికొన్ని ఉన్నాయి.


- సాక్షి, వెబ్‌డెస్క్‌ స్పెషల్‌

చదవండి: బొంగు బిజినెస్‌.. మన రేంజ్‌ ఇది 

మరిన్ని వార్తలు