ఐఎస్‌ఎస్‌కు తప్పిన పెనుముప్పు

31 Jul, 2021 03:49 IST|Sakshi

ఉండాల్సిన స్థానం నుంచి పక్కకు జరిగిన స్టేషన్‌

రష్యా ప్రయోగించిన మాడ్యూలే కారణం

సరిచేసిన నాసా నిపుణులు

మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు పెనుముప్పు తప్పింది. రష్యా ప్రయోగించిన ఓ మాడ్యూల్‌లో ఏర్పడిన మంటల కారణంగా ఐఎస్‌ఎస్‌ దిశ మారింది. నిమిషానికి అర డిగ్రీ చొప్పున మొత్తం 45 డిగ్రీల కోణంలోకి వెళ్లింది. భూమిపై ఏర్పాటు చేసిన సెన్సర్లు దీన్ని గుర్తించడంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అప్రమత్తమమై దాన్ని సరిచేసింది.

అసలేం జరిగింది: గురువారం రష్యాకు చెందిన నౌకా అనే మాడ్యూల్‌ ఐఎస్‌ఎస్‌ వద్దకు ప్రయాణ మైంది. ఐఎస్‌ఎస్‌కు  అది చేరుకున్న తర్వాత ఆటోమేటిగ్గా దానికి అనుసంధానం కావాల్సి ఉంది. అయితే, అలా జరగలేదు. దీంతో మాన్యువల్‌గా మాడ్యూల్‌ను ఐఎస్‌ఎస్‌కు అనుసంధానం చేశారు. అంతలోనే మరో సమస్య ఏర్పడింది. నౌకా మాడ్యూల్‌ లోని థ్రస్టర్‌లు ఉన్నట్టుండి మండటంతో ఐఎస్‌ఎస్‌ దిశ మారడం ప్రారంభమైంది. దీన్ని భూమ్మీద ఉన్న సెన్సర్‌లు గుర్తించడంతో నాసా శాస్త్రవేత్తలు అప్రమత్త మయ్యారు. నాసాకు చెందిన థ్రస్టర్లను, ఇంజిన్లను పూర్తిగా ఆపేశారు. దానికి వ్యతిరేక దిశలో ఉన్న మరో మాడ్యూల్‌ నుంచి థ్రస్టర్‌లను మండించి సరైన దిశకు  మళ్లించారు. ఈ ప్రక్రియ  45 నిమిషాల పాటు సాగింది.  ప్రారంభంలో మాడ్యూల్‌ దిశ మారుతుండగా మొదటి 15 నిమిషాల్లో కోల్పోయిన సిగ్నల్స్‌.. ఐఎస్‌ఎస్‌ తిరిగి సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ అందాయి.

ప్రమాదం జరిగి ఉంటే..
నాసా శాస్త్రవేత్తలు తక్షణం స్పందించ డంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్లు ప్రమాదంలో పడి ఉండేవారు. అలా జరిగితే ఆకాశంలోకి తప్పించుకోవడానికి వేరే సదుపాయాలు ఉన్నాయని నాసా పేర్కొంది. తప్పించుకోవడానికే ఏర్పాటు చేసిన స్పేస్‌ ఎక్స్‌ క్రూ కాప్సూ్యల్‌ వారి ప్రాణాలను రక్షించేదని తెలిపింది.

మరిన్ని వార్తలు