పరస్పరం గుర్తించాలి

23 Sep, 2021 05:47 IST|Sakshi

తద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయొచ్చని వ్యాఖ్య

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయొచ్చని ప్రధాని మోదీ బుధవారం సూచించారు. ఒక దేశంలో జారీ చేసిన వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను మరో దేశం గుర్తించే విధానం ఉండాలన్నారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు విదేశీయులను తమ భూభాగంలోకి అనుమతించే విషయంలో వేర్వేరు నిబంధనలను అమలు చేస్తున్నాయి.

ఈ నిబంధనల్లో ఏకరూపత రావాలని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ కోవిడ్‌ శిఖరాగ్ర సదస్సులో మోదీ వీడియో సందేశం ద్వారా పాలుపంచుకున్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు గుర్తుచేశారు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల సరఫరా వ్యవస్థను సరళతరం చేయాలని, దీనివల్ల ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు వీలుకలుగుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లతో దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని గుర్తుచేశారు.

ఈ సమస్య పరిష్కారంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపుతో ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. భారతీయులు స్వదేశంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ యూకేకు వచ్చిన తర్వాత 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని యూకే అంటోంది. ఈ నేపథ్యంలో  ప్రధాని మోదీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను పరస్పర గుర్తించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌లో 100 కోట్ల డోసుల ఉత్పత్తి: బైడెన్‌
కోవాక్స్‌ నిమిత్తం 2022 చివరికల్లా భారత్‌లో కనీసం 100 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేసే దిశగా క్వాడ్‌ సాగుతోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు. కోవిడ్‌–19ను జయించడానికి సమష్టిగా కృషి చేయడం కంటే అత్యవసరమైనది మరేదీ లేదన్నారు. వివిధ దేశాల్లో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచడానికి అమెరికా సాంకేతిక, ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు