అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇకపై ఇంటర్వ్యూ లేకుండానే వీసాలు!

4 Sep, 2022 10:41 IST|Sakshi

వాషింగ్టన్: భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్‌ప్రారంభమైన తరుణంలో  అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించింది. అయితే డిసెంబర్‌ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.

ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కానీ గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.

ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్‌మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది. కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది.

ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. కరోనా సమయంలో  పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని  2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది.
చదవండి: పరాన్నజీవులూ, వెళ్లిపొండి

మరిన్ని వార్తలు