ఓడా.. ఓడా.. ఎందుకాగావు? 

31 Mar, 2021 07:48 IST|Sakshi

సూయెజ్‌లో నౌకా ప్రతిష్ఠంభనపై దర్యాప్తు 

సూయెజ్‌: ఈజిప్టులోని ప్రఖ్యాత సూయెజ్‌ కాలువలో ఎవర్‌గివెన్‌ నౌక అడ్డం తిరగడం, దీంతో ప్రపంచ వాణిజ్యానికి దాదాపు వారం పాటు విఘాతం కలగడంపై విచారణ షురూ అయింది. వారం ప్రయత్నాల అనంతరం నౌకా ప్రతిష్ఠంభన ముగిసి తిరిగి నౌకల పయనం ఆరంభమవడంతో ఇప్పుడందరి దృష్టి అసలేం జరిగిందనే అంశంపైకి మరలింది. ఈజిప్టు ప్రభుత్వం, బీమా సంస్థలు, నౌకా సంస్థలతో పాటు పలువురు ఈ అంశంపై వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలవ గట్ల ఆధునీకరణ, నౌకల రిపేరు వ్యయాలు, నౌకల కార్గో షిప్‌మెంట్‌ ఇన్సూ్యరెన్సుల్లాంటి పలు అంశాలు చర్చకురానున్నాయి.

ఎవెర్‌గివెన్‌ నౌక ఓనర్‌ జపనీస్‌ కంపెనీ కాగా, దాన్ని నిర్వహిస్తున్నది తైవాన్‌ కంపెనీ, బయలుదేరింది పనామా నుంచి కాగా ప్రస్తుతం ఈజిప్టులో ఉంది, నౌకా సిబ్బంది భారతీయులు. దీంతో ఈ నౌక విషయం పలు దేశాలతో ముడిపడిఉందని షిప్పింగ్‌ నిపుణుడు జాన్‌కోనార్డ్‌ అభిప్రాయపడ్డారు. రోజుల తరబడి చిక్కుకుపోవడంతో నౌకకు భారీగానే డ్యామేజి జరిగి ఉంటుందంటున్నారు.  

సమగ్ర విచారణ కావాలి 
ప్రతిష్ఠంభనపై జరిగే విచారణలో పాల్గొంటామని నౌక సొంతదారైన జపాన్‌ కంపెనీ షోయి కిసెన్‌ కైషా తెలిపింది. అయితే విచారణ సమయంలో ఏ విషయాలు బహిర్గతం చేయరాదంటూ ఈ విషయంపై బహిరంగ ప్రకటనకు నిరాకరించింది. నౌక ఎందుకు నిలిచిపోయింది, నౌకకు ఏమి అడ్డం తగిలింది, నౌకకు రిపేర్లు ఎక్కడ చేయిస్తారు, ప్రమాద సమయంలో నౌకా వేగం ఎంత తదితర అంశాలనేవీ చెప్పలేమని పేర్కొంది. మరోవైపు నౌక కారణంగా జరిగిన రోజూవారీ నావిక నష్టాలు(పర్‌డే మారిటైమ్‌ లాస్‌) బిలియన్‌ డాలర్లలో ఉంటాయని, ఇవన్నీ క్రమంగా దావాల రూపంలో బయటకు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. నౌకకు 300 కోట్ల డాలర్ల మేర బీమా ఉంది, కానీ ఈ బీమా సంస్థలేవీ బడా బీమా సంస్థలు కావు.

ప్రస్తుతానికి నౌకా చిక్కుదలను విడిపించేందుకు అయిన ఖర్చులను కెనాల్‌ అథార్టీకి ఎవెర్‌ గివెన్‌ ఓనర్‌ చెల్లిస్తుందని అంతర్జాతీయ లీగల్‌ సంస్థ క్లైడ్‌ అండ్‌ కో తెలిపింది. నౌకపై కెనాల్‌ అథార్టీ పెనాల్టీ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని కంపెనీ కోరుతోంది. కెనాల్‌లోని నౌకా ట్రాఫిక్‌ క్లియరయ్యేందుకు మరో పదిరోజులు పట్టవచ్చని అంచనా. నౌక అడ్డం తిరగడంతో పలు నౌకలు సూయజ్‌ కెనాల్‌ మార్గం బదులు కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ మీదుగా ప్రయాణం చేయాల్సి వచ్చింది.

చదవండి: ‘ఎవర్‌ గివెన్‌’ ఎట్టకేలకు కదిలింది

మరిన్ని వార్తలు