ట్రంప్‌పై ఇరాన్‌ మంత్రి తీవ్ర ఆరోపణలు

1 Jan, 2021 13:21 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌(ఫైల్‌ ఫొటో)

టెహ్రాన్: అమెరికా తమపై దాడి చేసేందుకు యత్నిస్తోందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ ఆరోపించారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రణాళికలు రచిస్తున్నారని, ఇందులో భాగంగా తమ ప్రాంతంలో బీ52ఎస్‌ బాంబర్లు, యుద్ధవాహక నౌకలు మోహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి నిఘా వర్గాల సమాచారం తమ వద్ద ఉందని పేర్కొన్నారు. ‘‘అమెరికాలో కోవిడ్‌పై యుద్ధం చేసే బదులు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన అనుచరులు బీ52ఎస్‌, యుద్ధనౌకలు పంపిస్తూ మా ప్రాంతంలో అలజడి సృష్టించాలని బిలియన్ల కొద్దీ డాలర్లు వృథా చేస్తున్నారు. మాపై యుద్ధానికి వచ్చేందుకు వారు సిద్ధపడుతున్నట్లు ఇరాక్‌లోని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ఇరాన్‌ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు. అయితే తమ ప్రజలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తుంది. జాతి ప్రయోజనాలు, భద్రత దృష్ట్యా వెనకడుగు వేయకుండా దీటుగా బదులిస్తుంది’’ అని జరీఫ్‌ ట్విటర్‌ వేదికగా తమ వైఖరిని స్పష్టం చేశారు.(చదవండి: పశ్చిమాసియా శాంతికి ముప్పు)

ఇక ఈ విషయం గురించి ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ మిలిటరీ సలహాదారు మాట్లాడుతూ.. ‘‘కొత్త సంవత్సరాన్ని అమెరికన్లకు శోకంగా మార్చకండి’’అంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా గత కొన్నేళ్లుగా అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్‌ ఖుడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సులేమానిని అమెరికా దళాలు హతమార్చిన నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరు దేశాలు పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. ఇక బుధవారం మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసిన పెంటగాన్‌..  తమకు చెందిన బీ-52 న్యూక్లియర్‌ బాంబర్లు మధ్యప్రాచ్యంలోనే ఉన్నాయని పేర్కొంది. అయితే అదే సమయంలో, తాము ఉద్రిక్తతలు చల్లారేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకే వాటిని వెనక్కి రప్పించినట్లు అమెరికా అధికారులు పేర్కొనడం గమనార్హం.


 

మరిన్ని వార్తలు