Anti Hijab Protest: హిజాబ్‌ అల్లర్లతో...అట్టుడుకుతున్న ఇరాన్‌

24 Sep, 2022 05:12 IST|Sakshi

స్వేచ్ఛ కావాలంటూ వీధుల్లోకి మహిళలు

నియంతల పీడ పోవాలంటూ నినాదాలు

హిజాబ్‌లు తగలబెడుతూ ధర్నాలు

పోలీసులతో ఆందోళనకారుల బాహాబాహీ

కాల్పుల్లో 30 మందికి పైగా బలి!

ఇంటర్నెట్‌ నిలిపివేత, ఇంటింటి తనిఖీలు

ప్రపంచ దేశాల ధ్వజం, అమెరికా ఆంక్షలు

దుబాయ్‌: ఇరాన్‌లో హిజాబ్‌ కల్లోలం చినికిచినికి గాలివానగా మారుతోంది. నిర్బంధ హిజాబ్‌ ధారణ నిబంధనను వ్యతిరేకిస్తూ వారం రోజులుగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు నానాటికీ మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు హిజాబ్‌లను చేబూని జెండాల మాదిరిగా ఊపుతూ భారీ సంఖ్యలో నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటంటూ నిరసిస్తున్నారు.

‘మాకు స్వేచ్ఛ కావాల్సిందే’  అంటూ వీధుల్లోకి వస్తున్నారు. ‘నియంత ఖొమేనీకి మరణమే’, ‘ముల్లాల పీడ వదలాల్సిందే’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బహిరంగంగా జుత్తు కత్తిరించుకోవడంతో పాటు హిజాబ్‌లను తగలబెడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని టెహ్రాన్‌లో ఆందోళనకారులు ఓ పోలీసు వాహనానికి నిప్పు పెడుతున్న వీడియోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. పలుచోట్ల ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతూ కన్పించారు. పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగి నిరసనకారులపై విరుచుకుపడుతున్నాయి.

ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోయాయి. ‘ఓ దేవుడా! వాళ్లు విచక్షణారహితంగా కాల్చి పారేస్తున్నారు’ అని ఆక్రోశిస్తూ జనం చెల్లాచెదురుగా పారిపోతున్న దృశ్యాలు కొన్ని వీడియోల్లో కన్పిస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటిదాకా 26 మంది దాకా మరణించారని దేశ అధికారిక మీడియా సంస్థ చెబుతున్నా శుక్రవారమే ఏకంగా 30 మందికి పైగా బలైనట్టు తెలుస్తోంది. ఆందోళనకారుల పట్ల పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వెలిబుచ్చింది. అతి సమీపం నుంచి కాల్పులకు పాల్పడుతున్నారని ఆక్షేపించింది. ఇరాన్‌పై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు అల్లర్లను నిరసిస్తూ ప్రభుత్వ అనుకూల ర్యాలీలు కూడా జరుగుతున్నాయి.

సర్కారు ఉక్కుపాదం
నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది. ర్యాలీలు, ఆందోళనల పిలుపుకు ఆందోళనకారులు ప్రధానంగా ఆధారపడుతున్న ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌ వంటివాటిపై ఆంక్షలను తీవ్రతరం చేసింది. అనుమానితుల కోసం పోలీసులు ఇంటింటి సోదాలకు దిగుతున్నారు! వందలాది మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. హిజాబ్‌ ధరించలేదంటూ మాసా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని మోరల్‌ పోలీసులు అరెస్టు చేయడం, ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించడం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ గత శనివారం నుంచి దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు రోడ్లెక్కుతున్నారు.

హిజాబ్‌ ధరిస్తేనే ఇంటర్వ్యూ!
ఇరాన్‌ పాలకవర్గంలో గూడుకట్టుకుపోయిన సంప్రదాయవాదానికి తార్కాణమీ ఫొటో. కుర్చీలో కూర్చున్నది సీఎన్‌ఎన్‌ చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌ క్రిస్టియాన్‌ అమన్‌పోర్‌ (64). ఆమె ఎదురు చూస్తున్నది ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కోసం. ఐరాస సర్వసభ్య ప్రతినిధి సభలో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వచ్చిన రైసీ ఇరాన్‌లో చెలరేగుతున్న హిజాబ్‌ హింసాకాండపై ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తీరా సమయానికి ఆమె హిజాబ్‌ ధరించాలంటూ పట్టుబట్టారు. అందుకు క్రిస్టియాన్‌ ససేమిరా అన్నారు.

1995 నుంచీ ఇరాన్‌ అధ్యక్షులందరినీ హిజాబ్‌ ధరించకుండానే ఇంటర్వ్యూ చేశానని గుర్తు చేశారు. ‘‘ఇంటర్వ్యూ కోసం వారాల ముందునుంచీ ఏర్పాట్లు చేసుకున్నాం. నేను షెడ్యూల్‌ ప్రకారం సిద్ధమై అధ్యక్షుని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ ఆయన జాడే లేదు. 40 నిమిషాల తర్వాత సహాయకుడొచ్చి నేను హిజాబ్‌ ధరించి తీరాల్సిందేనని ఆయన కోరుతున్నట్టు తెగేసి చెప్పాడు. అందుకు నిరాకరించి ఇంటర్వ్యూనే రద్దు చేసుకున్నా’’ అంటూ ఈ అనుభవాన్ని ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు. ఇరాన్‌లో పుట్టిన క్రిస్టియానా 11 ఏళ్లొచ్చేదాకా టెహ్రాన్‌లోనే పెరిగారు.

మరిన్ని వార్తలు