ఇరాన్‌లో హిజాబ్‌ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి

25 Sep, 2022 05:52 IST|Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉధృతం రూపం దాలుస్తున్నాయి. కొత్త నగరాలు, పట్టణాలకు వ్యాపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి, నిర్బంధ హిజాబ్‌ ధారణ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు నిరసనలను ఇరాన్‌ భద్రతా దళాలు అణచివేస్తున్నాయి. భద్రతా సిబ్బంది దాడుల్లో ఇప్పటిదాకా 50 మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌(ఐహెచ్‌ఆర్‌) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ప్రకటించింది.

ఉత్తర గిలాన్‌ ప్రావిన్స్‌లోని రెజ్‌వన్‌షాహర్‌ పట్టణంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు బలయ్యారని తెలియజేసింది. బబోల్, అమోల్‌లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆయా పట్టణాల్లో కాల్పుల్లో పలువురు మృతిచెందారని ఫ్రాన్స్‌ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్‌ అత్యున్నత మతపెద్ద ఖమేనీ విగ్రహాన్ని ఆయన స్వస్థలం మషాద్‌లో నిరసనకారులు దహనం చేశారు. మరోవైపు ప్రభుత్వానికి మద్దతుగా టెహ్రాన్‌లో పలువురు ర్యాలీలు నిర్వహించారు. ఇరాన్‌లో పరిస్థితులపై ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు