సల్మాన్‌ రష్డీ దాడి: అది ఆయన స్వీయ అపరాధం.. ఎట్టకేలకు ఇరాన్‌ స్పందన

15 Aug, 2022 13:40 IST|Sakshi

టెహ్రాన్‌: బుకర్‌ ప్రైజ్‌ రచయిత, భారత సంతతికి చెందిన సల్మాన్‌ రష్డీ దాడిపై ఇరాన్‌ మౌనం వీడింది. దాడి వెనుక ఇరాన్‌ ప్రమేయం ఉందంటూ దాడి జరిగినప్పటికీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే దాడి విషయంలో తమను నిందిచడంపై ఇరాన్‌ తీవ్ర అసహనం వెల్లగక్కింది. 

ఈ దాడి విషయంలో నిందించాల్సింది.. సల్మాన్‌ రష్డీ, ఆయన మద్దతుదారులనేనని ఇరాన్‌ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాక్ స్వాతంత్ర్యం అనేది.. తన రచనలో ఒక మతానికి వ్యతిరేకంగా రష్దీ చేసిన అవమానాలను ఎంత మాత్రం సమర్థించదు అని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్‌ కన్నాని తెలిపారు. ఇస్లామిక్ పవిత్రతలను అవమానించడం ద్వారా ఆయన కోట్ల మంది  ఉన్న ఇస్లాం సమాజం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దాడికి ఆయన్ని, ఆయన అనుచరులను తప్ప ఎవరినీ నిందించలేం.

అంతేగానీ.. ఈ దాడి విషయంలో అసలు ఇరాన్‌ను నిందించే హక్కు ఎవరికీ లేదు. అది మాకు సంబంధంలేని విషయం అని నాజర్‌ కన్నాని తెలిపారు. ‘నిందితుడిని పొగుడుతూ వెలువడ్డ కథనాలు, సోషల్‌ మీడియా సంబురాల’ గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురుకాగా.. ఆ కథనాలు ప్రధానంగా ప్రచురితం అయ్యింది మాజీ అధ్యక్షుడు అయతొల్లా రుహోల్లాహ్‌కు చెందిన పత్రికల్లోనే అని, ఇక సోషల్‌ మీడియాలో ప్రజాభిప్రాయాలను తప్పుబట్టడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.  సల్మాన్‌ రష్డీపై దాడికి పాల్పడ్డ నిందితుడు హాది మతార్‌ గురించి మీడియాలో చూడడమే తప్ప.. అతని గురించి తమకెలాంటి సమాచారం లేదని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. 

ఇదిలా ఉంటే.. ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. 1998లో పబ్లిష్‌ అయిన ది సాటానిక్ వెర్సెస్.. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండడం, ఆ నిషేధిత నవలపై ఆగ్రహం వెల్లగక్కిన అప్పటి ఇరాన్‌ అధినేత అయతొల్లా రుహోల్లాహ్‌ ఖోమెయిని.. ఒక ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు. ఆ భయంతో దాదాపు చాలా ఏళ్లు సల్మాన్‌ రష్డీ అజ్ఞాతవాసంలోనే ఉండిపోయారు. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆయనపై నిందితుడు హాదీ మతార్‌.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కిమ్‌తో దోస్తీకి పుతిన్‌ తహతహ

మరిన్ని వార్తలు