Iran: అతిపెద్ద యుద్ధనౌక కథ విషాదాంతం

3 Jun, 2021 09:25 IST|Sakshi

మంటల్లో చిక్కి.. నీట మునిగిన ‘ఖర్గ్‌’

టెహ్రాన్‌: ఇరాన్‌ నావికా దళానికి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ‘ఖర్గ్‌’ కథ ముగిసింది. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో విధి నిర్వహణలో ఉన్న ఈ నౌకలో బుధవారం తెల్లవారుజామున 2.25 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరకు ఖర్గ్‌ నీట మునిగింది. ఈ యుద్ధ నౌక పొడవు 207 మీటర్లు (679 అడుగులు). సముద్రంలో ఇతర నౌకలను అవసరమైన సామగ్రిని సరఫరా చేయడానికి, శిక్షణ కోసం ఈ నౌకను ఉపయోగిస్తున్నారు.

అగ్నిప్రమాదం జరిగినప్పుడు నౌకపై 400 మంది సిబ్బంది ఉన్నారని, వారంతా ప్రాణాలతో బయటపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 20 మంది గాయపడ్డారని తెలియజేసింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 1,270 కిలోమీటర్ల దూరంలో హర్మూజ్‌ జలసంధికి సమీపంలో జాస్క్‌ పోర్టు వద్ద ఖర్గ్‌ నీటిలో మునిగిపోయింది.
గత ఏడాది ఇరాన్‌ సైన్యానికి శిక్షణ ఇస్తుండగా ఓ క్షిపణి పొరపాటున జాస్క్‌ పోర్టు వద్ద యుద్ధ నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది నావికులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. అంతకుముందు 2018లో ఇరాన్‌ యుద్ధనౌక కాప్సియన్‌ కూడా సముద్రంలో మునిగింది.

(చదవండి: వైరల్‌: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. కలవరపడుతున్న నెటిజన్లు )

మరిన్ని వార్తలు