ప్రవక్త కామెంట్లు: అజిత్‌ దోవల్‌ పేరుతో ‘గుణపాఠం ట్వీట్‌’.. కాసేపటికే డిలీట్‌

9 Jun, 2022 21:33 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేతలు మహమ్మద్ ప్రవక్త పట్ల చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఈ తరుణంలో.. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరాన్ విదేశాంగ మంత్రి న్యూఢిల్లీకి రావడం విశేషం. అయితే ప్రవక్త వ్యాఖ్యలను ఉద్దేశించి.. ఇరాన్‌ విదేశాంగ శాఖ చేసిన ఆసక్తికర ప్రకటనను కాసేపటికే ఇరాన్‌ డిలీట్‌ చేసింది. 

ప్రధాని మోదీతో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహేన్ భేటీ అయ్యారు. అలాగే, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతోనూ ఆయన చర్చలు నిర్వహించారు. కొందరు వ్యక్తులు మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వ్యతిరేక వాతావరణానికి దారితీసినట్టు ఆయన అజిత్ దోవల్ కు తెలియజేసినట్లు ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రకటించుకుంది. 

అందుకు బదులుగా భారత్ మహమ్మద్ ప్రవక్తను గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రికి భారత్ స్పష్టం చేసిందని, ఈ అంశంలో ఇతరులకు ఒక గుణపాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని దోవల్‌ హామీ ఇచ్చినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి ఓ ట్వీట్‌ కూడా చేశారు. అంతేకాదు.. నిందితుల పట్ల భారత్ అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ముస్లింలు సంతోషంగా ఉన్నట్టు ఆయన చెప్పారు.

అయితే ఈ ప్రకటనను కాసేపటికే భారత ప్రభుత్వం ఖండించింది. దీంతో ‘ఇతరులకు ఒక పాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని దోవల్‌ హామీ ఇచ్చినట్టు’ లైన్‌ను తొలగించి.. మరో ట్వీట్‌ చేశారు. ఇక విదేశాంగ మంత్రి వద్ద గానీ అసలు ప్రవక్త వ్యాఖ్యల అంశమే రాలేదని ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మరో ట్వీట్‌ చేశాడు ఇరాన్‌ విదేశాంగ మంత్రి.

మరిన్ని వార్తలు