మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది హతం; ఖండించిన ఇరాన్!‌

14 Nov, 2020 18:20 IST|Sakshi

టెహ్రాన్‌/వాషింగ్టన్‌: ఉగ్ర సంస్థ ఆల్‌ఖైదా ముఖ్య నాయకుడు అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబూ మహ్మద్‌ అల్‌-మస్రీ హతమయ్యాడన్న న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై ఇరాన్‌ స్పందించింది. ఇవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేసింది. అసలు తమ భూభాగంలో ఆల్‌-ఖైదా ఉగ్రవాదులే లేరని స్పష్టం చేసింది. ఇరాన్‌ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా వ్యవహరించడం డొనాల్డ్ ట్రంప్‌ యంత్రాంగానికి పరిపాటిగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా 1998లో ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాల పేలుళ్లకు సూత్రధారిగా భావిస్తున్న ఆల్‌ఖైదా సెకండ్‌-ఇన్‌-కమాండ్‌ మస్రీను ఇజ్రాయెల్‌ బలగాలు మట్టుబెట్టినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అగ్రరాజ్యం తరఫున రంగంలోకి దిగిన ఇజ్రాయెల్‌ సేనలు ఆగష్టు నెలలో అతడిని హతమార్చినట్లు ఇంటలెజిన్స్‌ వర్గాలు వెల్లడించాయని న్యూయార్క్‌ టైమ్స్‌ శుక్రవారం పేర్కొంది.

టెహ్రాన్‌ వీధుల గుండా వెళ్తున్న మస్రీని ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిలు మీద వెంబడించి తుపాకీతో అతడిని కాల్చినట్లు వెల్లడించింది. మస్రీ వారసుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఐమన్‌ అల్‌-జవాహిరి ఇప్పటి వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడని తన కథనంలో పేర్కొంది. అయితే మస్రీ కోసం గత కొన్నేళ్లుగా జల్లెడ పడుతున్న అమెరికా, అతడి హతం వెనుక ఎలాంటి పాత్ర పోషించిందన్న అంశంపై స్పష్టత లేదని తెలిపింది. అదే విధంగా ఆల్‌ఖైదా మస్రీ మృతిని ధ్రువీకరించకుండా ఇరాన్‌ ప్రభుత్వం కట్టడి చేసిందని పేర్కొంది. ఈ కథనాన్ని ఖండిస్తూ ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి సయీద్‌ ఖతీబ్‌జదేశ్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. (చదవండి: ట్రంప్‌ నిర్ణయాలన్నీ ‘తలకిందులే’నా?!)

‘‘అలాంటి(ఉగ్రవాద) గ్రూపులతో ఇరాన్‌ పేరును ముడిపెడుతూ అసత్య కథనాలు ప్రసారం చేసేలా మీడియాకు లీకులివ్వడం ట్రంప్‌ యంత్రాంగానికి సర్వసాధారణమైపోయింది. నేరగాళ్ల కార్యకలాపాలను కట్టడిచేయలేక, ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల చెలరేగుతున్న కల్లోలాన్ని రూపుమాపలేక తమ చేతకానితనాన్ని ఇతరులపై రుద్దుతున్నారు. ఇరాన్‌ను భయపెట్టేందుకు వేసే ఎత్తుగడలు పనిచేయవు’’ అని కౌంటర్‌ ఇచ్చారు. కాగా ఆగష్టు 7నాటి ఆపరేషన్‌లో మస్రీతో పాటు అతడి కూతురు, ఒసామా బిన్‌ లాడెన్‌ కోడలు(హంజా బిన్‌లాడెన్‌ భార్య) కూతురు కూడా మృతి చెందినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇక మస్రీ 2003 నుంచి ఇరాన్‌ కస్టడీలోనే ఉన్నాడని, 2015 నుంచి టెహ్రాన్‌లో స్వేచ్చగా జీవించేందుకు అతడికి అవకాశం లభించిందని ఇంటలెజిన్స్‌ అధికారులు చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. కాగా ఇరాన్‌ అధికార మీడియా మాత్రం ఆగష్టు 7న దుండగుల దాడిలో మరణించింది లెబనీస్‌ హిస్టరీ ప్రొఫెసర్‌ హబీబ్‌ దావూద్‌, అతడి కుమార్తె మరియం అని పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు