వీడియో: ఇక చాలూ.. ఆమె చర్యతో యూరోపియన్‌ పార్లమెంట్‌లో మౌనం

5 Oct, 2022 21:28 IST|Sakshi

స్ట్రాస్‌బర్గ్‌(ఫ్రాన్స్‌): యూరోపియన్‌ పార్లమెంట్‌లో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్వీడన్‌ సభ్యురాలైన అల్‌ సహ్లానీ ఎవరూ ఊహించని చేష్టలకు దిగారు. ఇరాన్‌ మహిళలకు సంఘీభావంగా పార్లమెంట్‌లోనే ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో.. తోటి సభ్యులంతా షాక్‌ తిన్నారు. 

మహ్‌సా అమినీ అనే యువతి మృతి నేపథ్యంతో మొదలైన హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు ఉధృత స్థాయిలో కొనసాగుతున్నాయి అక్కడ. ఈ పోరాటంలో పాల్గొంటున్న ఇరాన్‌ మహిళలకు సంఘీభావం తెలిపే క్రమంలో తన జుట్టు కత్తిరించుకున్నారు అల్‌ సహ్లానీ. ఈయూ పార్లమెంట్‌లో ఇరాన్‌ ఆందోళనలపై ఆమె ప్రసంగించారు.

‘‘మౌనంగా ఉంది ఇక చాలూ. ఈయూ పౌరులమైన మనం.. ఇరాన్‌లో సాధారణ పౌరులపై జరుగుతున్న హింసాకాండను ఆపేయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేద్దాం. వాళ్లు(ఇరాన్‌ పౌరులను ఉద్దేశించి) తమ జీవితాలను పణంగా పెట్టి అక్కడ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఇరాన్‌కు స్వేచ్చ లభించేంత వరకు.. అణచివేతదారుల కంటే మన ఆవేశం ఎక్కువగానే ఉంటుంది. ఇరాన్ మహిళలు.. మీకు స్వేచ్ఛ లభించేంత వరకు మేం మీకు అండగా ఉంటాం. జిన్‌ జియాన్‌ ఆజాదీ(వుమెన్‌, లైఫ్‌, ఫ్రీడమ్‌) అంటూ ఆమె వెంట తెచ్చుకున్న కత్తెరతో తన పోనీ టేల్‌ను కత్తిరించుకున్నారామె.

ఇరాన్‌లో పుట్టిన అబిర్‌ అల్‌-సహ్లానీ.. స్టాక్‌హోమ్‌(స్వీడన్‌) హగెర్‌స్టన్‌లో స్థిరపడ్డారు. 2009 జులై నుంచి ఆమె స్వీడన్‌ సభ్యురాలిగా యూరోపియన్‌ పార్లమెంట్‌లో కొనసాగుతున్నారు. ఇక ఇరాన్‌ హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేసేందుకు భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో వంద మందికి పైగా సాధారణ పౌరులు మరణించారు. మరోవైపు ఇరాన్‌ మహిళలు, స్కూల్‌ చిన్నారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీళ్ల ఆందోళనకు మద్దతుగా ప్రముఖులు సైతం జుట్టు కత్తిరించుకుని సంఘీభావం తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు