జో బైడెన్‌తో భేటీ కాను

22 Jun, 2021 04:46 IST|Sakshi

ఇరాన్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీ వ్యాఖ్య

దుబాయ్‌: బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమం, స్థానిక పౌరసేనలకు మద్దతు వంటి అంశాల్లో తమ వైఖరి మారబోదని ఇరాన్‌ కాబోయే అధ్యక్షుడు  ఇబ్రహీం రైసీ కుండబద్దలు కొట్టారు. వీటిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చించబోనని, ఆయనతో భేటీ అయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 1988లో 5,000 మందిని సామూహికంగా ఉరితీసిన ఘటనలో రైసీ పాత్ర గురించి మీడియా ప్రస్తావించగా.. తనను తాను మానవ హక్కుల పరిరక్షకుడిగా అభివర్ణించుకున్నారు.

ఇప్పుడు దేశ అధ్యక్షుడిగా మానవ హక్కులను కాపాడడం తన విధి అన్నారు. ఇరాన్‌పై విధించిన అన్ని రకాల అణచివేత ఆంక్షలను ఎత్తివేయాల్సిన బాధ్యత అమెరికాపై ఉందని వ్యాఖ్యానించారు. తమ బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రోగ్రామ్, స్థానిక మిలీషియా సంస్థలకు మద్దతుపై మాట్లాడాల్సింది, చర్చించాల్సింది ఏమీ లేదని పేర్కొన్నారు. తమ శత్రుదేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ దూకుడును అడ్డుకోవడానికి యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్‌ సంస్థకు ఇరాన్‌ అండగా ఉండటం తెల్సిందే.
 

మరిన్ని వార్తలు