Afghanistan: అమెరికా ఓటమితో అఫ్గన్‌లో శాంతి: ఇరాన్‌

16 Aug, 2021 19:52 IST|Sakshi

టెహ్రాన్‌: అఫ్గనిస్తాన్‌లో అమెరికా ఓటమి శాంతి పునరుద్ధరణకు దోహదం చేస్తుందని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ అన్నారు. అఫ్గన్‌లో భద్రతతో కూడిన జీవనం, శాంతి స్థాపనకు చక్కటి అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, సైన్యం ఓటమి ద్వారా.. శాంతి తిరిగి నెలకొంటుంది. జీవన గమనం సజావుగా సాగేందుకు గొప్ప అవకాశం దొరికింది’’అని ఆయన కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

అదే విధంగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణలో భాగంగా.. అఫ్గనిస్తాన్‌తో ఇరాన్‌ సత్సంబంధాలు ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉందని రైజీ పేర్కొన్నారు. అఫ్గన్‌లో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితుల గురించి తనకు తెలియజేయాల్సిందిగా జరీఫ్‌, ఇరాన్‌ జాతీయ భద్రతా మండలిని ఆదేశించారు. కాగా అమెరికా, తాలిబన్‌ సంస్థ మధ్య కుదిరిన చారిత్రక శాంతి ఒప్పందం నేపథ్యంలో అగ్రరాజ్య సైన్యం అఫ్గనిస్తాన్‌ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో అధికారం చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అష్రఫ్‌ ఘనీ.. జైలులో మగ్గుతున్న తాలిబన్ల విడుదలకు అంగీకరించారు. అయితే, గత కొన్నాళ్లుగా ప్రాబల్యం పెంచుకున్న తాలిబన్లు.. అఫ్గనిస్తాన్‌ను ఆదివారం పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ఘనీ దేశం విడిచి పారిపోయారు. ఈ నేపథ్యంలో శాంతియుతంగా అధికార మార్పిడి చేసుకుంటామంటూ తాలిబన్లు ప్రకటించారు.

యుద్ధంతో సమస్య పరిష్కారం కాదు
ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం భిన్నంగా స్పందిస్తోంది. ముఖ్యంగా అమెరికాతో వైరం ఉన్న ఇరాన్‌... గతం(1998)లో అఫ్గన్‌లో తమ రాయబార కార్యాలయంలో ప్రవేశించి దౌత్యాధికారులను హతమార్చిన తాలిబన్ల(తమకు చెప్పకుండానే కొంతమంది సొంత నిర్ణయాలతో ఈ ఘటనకు పాల్పడినట్లు తాలిబన్‌ అప్పట్లో ప్రకటన విడుదల చేసింది)కు పరోక్షంగా మద్దతు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాలిబన్లు అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న అంశంపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి జరీఫ్‌ స్పందిస్తూ... ‘‘హింస, యుద్ధంతో ఎన్నటికీ సమస్యలు పరిష్కారం కావు.

అయితే శాంతి పునరుద్ధరణకు జరిగే ప్రయత్నాలకు ఇరాన్‌ అండగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. అఫ్గనిస్తాన్‌ చైనా రాయబారి యూ షియోంగ్‌తో టెహ్రాన్‌లో సోమవారం సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇక తాలిబన్లతో స్నేహపూర్వక బంధాలు కోరుకుంటున్నామంటూ చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ జరగడం గమనార్హం. కాగా ఇరాన్‌ అఫ్గనిస్తాన్‌తో సుమారు 900 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటోంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం..‘‘బానిస సంకెళ్లను తెంచారు’’ అంటూ తాలిబన్లకు మద్దతు పలకడం విశేషం.

చదవండి: Afghanistan: తాలిబన్ల గుప్పిట్లో అఫ్గనిస్తాన్‌.. చైనా కీలక ప్రకటన  

మరిన్ని వార్తలు