హిజాబ్ నిరసనలు.. అనారోగ్యంతోనే ఆ ‘యువతి’ మరణించిందన్న ఇరాన్‌!

7 Oct, 2022 21:25 IST|Sakshi

టెహరాన్‌: మాహ్‌సా అమీని(22) అనే యువతి మృతితో ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న ఆరోపణలతో నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, అమీని మృతిపై విచారణ చేపట్టిన అధికారి నివేదిక మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆమె అనారోగ్య కారణాలతోనే మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. తల, శరీర భాగాలకు దెబ్బలు తగలడం వల్ల ఆమె చనిపోలేదని.. సెరిబ్రల్ హైపాక్సియా కారణంగా అవయవాల వైఫల్యంతో మరణించినట్లు అందులో తేలిందని ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ శుక్రవారం పేర్కొంది.

కుటుంబంతో కలిసి టెహ్రాన్‌ ట్రిప్‌కు వెళ్లిన యువతిని హిజాబ్‌ ధరించలేదని పోలీసులు అరెస్ట్‌ చేసి కస్టడీకి తరలించారు. అయితే.. ఆ తర్వాత స్ప్రహ కోల్పోయిందంటూ ఆసుపత్రిలో చేర‍్పించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో అమినీకి గాయాలయ్యాయని, ఆమె మృతికి పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, తల, కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం వల్ల అమినీ మరణించలేదని నివేదిక పేర్కొనటం గమనార్హం. కానీ, ఆమెకు ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతర్లీన వ్యాధుల కారణంగా కస్టడీలో ఉన్న సమయంలో ఆమె కుప్పకూలిందని తెలిపింది. శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ఆమె హైపాక్సియాకు గురైందని, ఫలితంగా మెదడు దెబ్బతిన్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: హిజాబ్‌ ధరించలేదని పోలీసుల టార్చర్‌?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి

మరిన్ని వార్తలు