అణు నిఘాను ఇరాన్‌ అడ్డుకుంటోంది

10 Jun, 2022 04:29 IST|Sakshi

ఐరాస అణు ఇంధన సంస్థ ఆందోళన

వియెన్నా: అణు కేంద్రాల వద్ద ఉన్న నిఘా కెమెరాలను ఇరాన్‌ తొలగించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ పర్యవేక్షణ కోసం నతాంజ్‌ భూగర్భ అణు శుద్ధి కేంద్రం వద్ద బిగించిన రెండు కెమెరాలను ఆఫ్‌ చేసినట్లు బుధవారం ఇరాన్‌ ప్రకటించింది. యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు కూడా ఇరాన్‌ ఐఏఈఏకి సమాచారం అందించింది. అగ్రరాజ్యాలతో జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే ఇరాన్‌ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.

దేశంలోని మూడు అప్రటిత ప్రాంతాల్లో కనుగొన్న అణుధార్మిక పదార్ధాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందించడంలో విఫలమైందంటూ ఇరాన్‌ను బుధవారం ఐఏఈఏ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐఏఈఏలోని 35 దేశాలకు 30 బలపరిచాయి. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయగా లిబియా, పాకిస్తాన్, భారత్‌ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రఫేల్‌ మరియానోవియెన్నాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌ అధికారులు నతాంజ్, ఇస్ఫాహాన్‌ల వద్ద ఉన్న రెండు మాత్రమే కాదు, మొత్తం 40కి పైగా కెమెరాలకు గాను 27 కెమెరాలను మూసేసినట్లు సమాచారం ఉందన్నారు. ఈ చర్యతో ఇరాన్‌ అణు కార్యక్రమం పురోగతి వివరాలు అంతర్జాతీయ సమాజానికి వెల్లడయ్యే అవకాశం లేదన్నారు. అణుకేంద్రాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఇరాన్‌ 2021 నుంచే ఐఏఈఏకి అందించడం మానేసింది.   

మరిన్ని వార్తలు