ఇరాక్‌ ప్రధానిపై హత్యాయత్నం

8 Nov, 2021 06:10 IST|Sakshi

బాగ్దాద్‌: ఇరాక్‌ ప్రధానమంత్రి ముస్తఫా–అల్‌–కదిమి హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆదివారం వేకువజామున కదిమి నివాసమే లక్ష్యంగా సాయుధ డ్రోన్లతో దాడి జరిగిందని, ఆయనకు ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. గత నెలలో వెలువడిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను ఇరాన్‌ మద్దతుగల మిలీషియాలు తిరస్కరించడంతో తలెత్తిన ఉద్రిక్తతలకు తాజా ఘటన ఆజ్యం పోసినట్లయింది. ప్రభుత్వ ఆఫీసులు, దౌత్య కార్యాలయాలతో అత్యధిక భద్రతా ఏర్పాట్లుండే గ్రీన్‌ జోన్‌ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ప్రధాని నివాసంపై పేలుడు పదార్థాలు నిండిన రెండు డ్రోన్లతో జరిగిన దాడిలో కదిమి భద్రతా సిబ్బంది ఏడుగురు గాయపడినట్లు పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు అసోసియేటెడ్‌ ప్రెస్‌కు తెలిపారు. ‘దేవుని దయవల్ల నేను, నా ప్రజలు క్షేమంగా ఉన్నాం’అని ప్రధాని కదిమి దాడి అనంతరం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, దాడికి బాధ్యత తమదేనంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇరాక్‌ ప్రధానిపై డ్రోన్‌ దాడిని అమెరికా, ఈజిప్టు, యూఏఈ ఖండించాయి. దేశంలో అక్టోబర్‌ 10వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణపై ఐరాస భద్రతామండలి కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇరాన్‌ మద్దతున్న మిలీషియా గ్రూపులు మాత్రం రీకౌంటింగ్‌ చేపట్టాలంటూ గ్రీన్‌జోన్‌కు సమీపంలో టెంట్లు వేసుకుని నిరసనలు సాగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు