-

‘ప్రాఫెట్‌ సాంగ్‌’ పుస్తకానికి బుకర్‌ ప్రైజ్‌

28 Nov, 2023 05:55 IST|Sakshi

ఐర్లాండ్‌ రచయిత పాల్‌ లించ్‌కు ప్రతిష్టాత్మక బహుమతి  

లండన్‌: ఐర్లాండ్‌ రచయిత పాల్‌ లించ్‌ రాసిన ‘ప్రాఫెట్‌ సాంగ్‌’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌–2023 లభించింది. లండన్‌కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన తొలి నవల ‘వెస్ట్రన్‌ లేన్‌’ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా, ప్రొఫెట్‌ సాంగ్‌ విజేతగా నిలిచింది. తాజాగా లండన్‌లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. 46 ఏళ్ల పాల్‌ లించ్‌ బుకర్‌ ప్రైజ్‌ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు రూ.52,64,932 నగదు లభించింది.

దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలు, పెరిగిపోతున్న నిరంశకుత్వం, ప్రబలుతున్న అశాంతి, వలసల సంక్షోభం.. వంటి పరిస్థితుల్లో ఐర్లాండ్‌లో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓ మహిళ చేసిన పోరాటాన్ని ‘ప్రాఫెట్‌ సాంగ్‌’ నవలలో పాల్‌ లించ్‌ హృద్యంగా చిత్రీకరించారు. కెన్యాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన ‘వెస్ట్రన్‌ లేన్‌’ నవల టాప్‌–6లో నిలిచింది.  

మరిన్ని వార్తలు