500 రాకెట్ల దాడిని అడ్డుకున్న ‘ఐరన్‌ డోమ్‌’

12 May, 2021 21:22 IST|Sakshi

గాజా సిటీ: దాదాపు 500 రాకెట్లు ఒక్కసారిగా దాడి చేస్తే.. ఎంతటి విధ్వంసం జరగాలి. కానీ ఇజ్రాయెల్‌ మాత్రం చాలా తక్కువ నష్టంతో బయటపడింది. ఇదేలా సాధ్యం అంటే ఐరన్‌ డోమ్‌. ఇజ్రాయెల్‌ను రక్షించిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థ. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శత్రుత్వం కొనసాగుతున్న తరుణంలో,  సోమవారం సూర్యాస్తమయం నుంచి గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి 1,050 కి పైగా రాకెట్లు, మోర్టార్ షెల్స్‌తో దాడులకు తెగబడ్డారు. ఈ హింసాకాండలో ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ దాదపు 500 రాకెట్లను అడ్డుకున్నట్లు తెలిపింది.

ఐరన్‌ డోమ్‌ అంటే ఏంటి..
సాధారణంగా తక్కువ దూరాల్లోని శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, మోర్టార్లను వినియోగిస్తుంటారు. దూరం తక్కువ ఉండటంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థే ఐరన్‌ డోమ్‌. దీన్ని అమెరికా సాయంతో ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ పది సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసింది.  2011లో దీనిని వినియోగంలోకి తీసుకొచ్చింది. గాజాస్ట్రిప్ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ని ఇది ఎదుర్కొంటుంది.  దీని రేంజ్‌ 70 కిలోమీటర్ల వరకు ఉంది. 

ఎలా పని చేస్తుంది.. 
ఈ వ్యవస్థ మొత్తంలో రాడార్లు,సాఫ్ట్‌వేర్‌,రాకెట్‌ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజాస్ట్రిప్ లో రాకెట్‌ ప్రయోగించిన వెంటనే రాడార్‌ పసిగట్టి.. దాని  గురించిన సమాచారాన్ని సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థకు పంపిస్తుంది. టార్గెట్‌ రాకెట్‌ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్‌ను ప్రయోగించదు. ఒకవేళ అది జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ప్రయోగించి శత్రువుల రాకెట్‌ను గాల్లోనే పేల్చివేస్తుంది. దీని సక్సెస్‌ రేట్‌ 90 శాతంగా ఉంది.

చదవండి: భర్తతో వీడియో కాల్‌.. ఇంట్లోకి దూసుకొచ్చిన రాకెట్

మరిన్ని వార్తలు