‘ఇండియన్లు, చైనీయులు దేశం విడిచి వెళ్లిపోండి’

2 Sep, 2020 08:34 IST|Sakshi

టక్సాస్‌లో మెయిల్‌ కలకలం

టెక్సాస్‌: అమెరికాలో మరోసారి జాత్యహంకార బెదిరింపుల కలకలం రేగింది. స్వదేశానికి తిరిగి వెళ్లకపోతే కాల్పులకు దిగుతామంటూ గుర్తు తెలియని దుండగులు టెక్సాస్‌లోని ఇర్వింగ్‌ నివాసికి మెయిల్‌ పంపించారు. వలసదారుల వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదని, కాబట్టి వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. లేని పక్షంలో విచక్షణారహితంగా కాల్పులకు దిగుతామంటూ బెదిరించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, చైనీయులు సహా ఇతర ఆసియా దేశాల ప్రజలను ఉద్దేశించి జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ను సంప్రదించి విచారణ ముమ్మరం చేశారు. లేఖ రాసిన దుండగుల చిరునామా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: భారత సంతతి రీసెర్చర్‌ హత్య)

ఈ నేపథ్యంలో ఇలాంటి వేధింపులు, విద్వేషపూరిత చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇర్వింగ్‌ పోలీసులు స్పష్టం చేశారు. అదే విధంగా ఇలాంటి మెయిల్స్‌ ఇంకా ఎవరికైనా వచ్చి ఉంటే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు... ‘‘ఐటీ ఇండస్ట్రీ, ఇతర రంగాల్లో భారతీయులు, చైనీయుల కారణంగా అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీరంతా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి. లేనట్లయితే మీరు పనిచేసే చోట, స్విమ్మింగ్‌ పూల్‌ లేదా ప్లేగ్రౌండ్‌ ఇలా ఎక్కడైనా విచక్షణారహితంగా కాల్పులకు దిగడం కంటే మాకు వేరే మార్గం లేదు’’ దుండగులు పంపిన లేఖను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తూ కమ్యూనిటీ అలర్ట్‌ జారీ చేశారు. 

కాగా యూఎస్‌ హౌజ్‌ క్యాండిడేట్‌ (టెక్సాస్‌-24), డెమొక్రటిక్‌ పార్టీ నేత కాండేస్‌ వాలేన్‌జులా మాట్లాడుతూ.. ‘‘ఉత్తర టెక్సాస్‌లో ఇలాంటి విద్వేషానికి తావులేదు. మనమంతా కలిసి కట్టుగా ఉండి ఇలాంటి పిరికపంద చర్యలను, జాత్యహంకార, విభజన పూరిత చర్యలను తిప్పికొట్టాలి. ఇలాంటి ఘటనలకు మరింత ఆజ్యం పోయకుండా, ఉద్రిక్తతలు చల్లారేలా వ్యవహరించాలి’’అని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు