అంటువ్యాధి వస్తే.. గుర్రపు బండొచ్చేది!

3 Oct, 2021 02:42 IST|Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి దాడి మొదలై ఏడాదిన్నర దాటింది. వైరస్‌ వ్యాప్తి మొదలైన కొత్తలో పాజిటివ్‌ రిపోర్టు రాగానే.. అంబులెన్సుల్లో పేషెంట్లను ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించడం.. వారి ఇళ్లు, చుట్టు పక్కల ప్రాంతాల్లో శానిటైజేషన్‌ వంటివి చేశారు. ఆఫీసులు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ ముందు డిసిన్ఫెక్షన్‌ టన్నెళ్లు పెట్టారు. మొదట్లో మనకు ఇదంతా కొత్తగా, వింతగా అనిపించినా.. ఇంగ్లండ్‌లోని లండన్‌ నగరంలో సుమారు 150 ఏళ్లకు ముందే ఇలాంటివి మొదలయ్యాయి. ఎవరి కైనా, ఏదైనా అంటువ్యాధి సోకిందంటే చాలు.. అంతా హడావుడే. ఇందుకోసం ఓ భారీ ఐసోలేషన్‌–డిసిన్ఫెక్షన్‌ కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..

ఆవిరి యంత్రాల్లో..
అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అంటు వ్యాధులకు సంబంధించి 1866 నుంచే లండన్‌లో డిసిన్ఫెక్షన్‌ చర్యలు చేపట్టేవారు. దీనికి సంబంధించి 1891లో ఏకంగా ఓ చట్టమే చేసేశారు. స్మాల్‌పాక్స్, డిఫ్తీరియా, టీబీ, స్కార్లెట్‌ ఫీవర్, తట్టు వంటి అంటువ్యాధులు వచ్చినా.. తీవ్రమైన దగ్గు వంటి సమస్యలు ఉన్నా.. సదరు రోగుల ఇంటికి ప్రభుత్వ గుర్రపు బగ్గీ వచ్చేది. పేషెంట్లను ఆస్పత్రులకు తరలించి, వారి ఇంటిని, వాడిన వస్తువులను డిసిన్ఫెక్ట్‌ చేసేవారు. అయితే వ్యాధుల తీవ్రత పెరుగుతుండటంతో.. 1893లో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తీవ్ర ఒత్తిడితో కూడిన వేడి నీటిఆవిరిని వినియోగించి.. రోగుల బట్టలు, దుప్పట్లు, ఇతర వస్తువులను డిసిన్ఫెక్ట్‌ చేసేవారు.

గంధకంతో స్నానం
ఏదైనా అంటువ్యాధితో బాధపడుతున్న వారికి సంబంధించి మూడు దశల్లో డిసిన్ఫెక్షన్‌ ప్రక్రియ జరిగేది. 
బాధితులను గుర్రపు బండిలో హక్నీబరో సెంటర్‌కు తరలించేవారు. వారి దుస్తు లు, దుప్పట్లు, ఇతర సామగ్రిని కూడా తీసుకొచ్చేవారు. పేలు, ఫంగస్, ఇతర క్రిములు నాశనం అవుతాయన్న ఉద్దేశంతో.. రోగుల దుస్తులన్నీ తొలగించి వారికి సల్ఫర్‌ స్నానం చేయించేవారు. శుభ్రమైన ఇతర వస్త్రాలు ఇచ్చి.. స్టేషన్‌లోని ప్రత్యేక గదుల్లో వారిని ఉంచేవారు. 
రోగులకు సంబంధించిన దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులను ‘హైప్రెషర్‌ స్టీమ్‌ (తీవ్ర ఒత్తిడితో కూడిన నీటిఆవిరి)’యంత్రాల్లో పెట్టి.. ఫార్మాల్డిహైడ్‌ రసాయనం స్ప్రే చేసి డిసిన్ఫెక్ట్‌ చేసేవారు. డిసిన్ఫెక్షన్‌ చేసే వీలులేని వాటిని కొలిమిలో పడేసి కాల్చేసేవారు. 
ఇదే సమయంలో రోగి ఇల్లు, పరిసరాల్లో ఫార్మాల్డిహైడ్‌ రసాయనం స్ప్రే చేసి డిసిన్ఫెక్ట్‌ చేసేవారు.  

హక్నీబరో సెంటర్‌తో.. 
అంటువ్యాధులు విజృంభిస్తుండటంతో 1897 బ్రిటన్‌ ప్రభుత్వం మరో చట్టం చేసింది. ఎలుకలు, ఇతర జంతువుల ద్వారా అంటు వ్యాధులు విస్తరించిన ప్రాంతాలను డిసిన్ఫెక్ట్‌ చేయాలని.. ఇందుకోసం స్థానిక ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయవచ్చని ప్రకటించింది. లండన్‌ శివార్లలోని హక్నీ పట్టణానికి చెందిన వైద్యాధికారి జాన్‌కింగ్‌ ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని.. 1901లో హక్నీబరో డిసిన్ఫెక్షన్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. అంటువ్యాధులు సోకినవారిని, వారి బట్టలు, దుప్పట్లు, ఇతర సామగ్రిని ఈ స్టేషన్‌కు తరలించేవారు. ఐసోలేషన్‌ తరహాలో ఒకట్రెండు రోజులు అక్కడే ఉంచుకుని పంపేవారు. సామగ్రిని డిసిన్ఫెక్ట్‌ చేసి ఇచ్చేవారు.

వేల మందికి ట్రీట్‌మెంట్‌.. 
హక్నీబరో స్టేషన్‌ ఏర్పాటైన తొలి ఏడాది 2,800 ఇళ్లను, 24 వేలకుపైగా రకరకాల సామగ్రిని డిసిన్ఫెక్ట్‌ చేశారు. ఐతే ఈ స్టేషన్‌లో క్వారంటైన్‌ కావడానికి మాత్రం జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రోగుల కోసం ఏర్పాటు చేసి న గదులను వైద్య సిబ్బందికి బసగా మార్చారు.

సైనైడ్‌తో శుభ్రం చేసి..  
1934లో హక్నీబరో స్టేషన్‌ను మరో చిత్రమైన పనికి వాడారు. అంటువ్యాధులను నివారించడానికి లండన్‌లోని ఓ మురికివాడ ప్రజలను ఇతర చోటికి తరలించారు. ఈ క్రమంలో వారి ఇళ్లలోని సామగ్రి అంతటినీ ట్రక్కుల్లో నింపి.. స్టేషన్‌లో కొత్తగా నిర్మించి సీల్డ్‌ షెడ్లకు తరలించారు. షెడ్లలోకి ‘హైడ్రోజన్‌ సైనైడ్‌’వాయువును నింపి.. సామగ్రి అంతటినీ డిసిన్ఫెక్ట్‌ చేసి యజమానులకు అందజేశారు.

‘హైడ్రోజన్‌ సైనైడ్‌’ విషపూరితమైనవాయువు. జర్మన్‌ నాజీలు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను, శత్రు సైనికులను ఇలాంటి గ్యాస్‌ నింపిన షెడ్లలోకి పంపి చంపేయడం గమనార్హం. 
హక్నీబరో స్టేషన్‌ను తర్వాత విదేశాల నుంచి వచ్చిన వస్త్రాలను డిసిన్ఫెక్ట్‌ చేయడానికి వాడారు. 
చివరిగా 1984లో స్కూలు పిల్లల తలలో పేలను డిసిన్ఫెక్ట్‌ చేయడానికి ఈ స్టేషన్‌ను వినియోగించారు. తర్వాత మూసేశారు. శిథిలావస్థకు చేరిన ఆ స్టేషన్‌ ఇప్పటికీ నిలిచే ఉంది.  

>
మరిన్ని వార్తలు