ఇండియా చేతికి ఇజ్రాయెల్‌ డ్రోన్‌గార్డ్‌ వ్యవస్థ?!

4 Jul, 2021 02:48 IST|Sakshi

దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్‌ఐ–4030 డ్రోన్‌ గార్డ్‌ వ్యవస్థను(సీ–యూఏఎస్‌)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్ల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సంస్థ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. కొన్ని కోట్ల డాలర్లకు డ్రోన్‌ గార్డ్‌ విక్రయాన్ని పూర్తి చేశామని మాత్రమే ఈనెల 2న ఐఏఐ ప్రకటించినట్లు డిఫెన్స్‌ వార్తల ప్లాట్‌ఫామ్‌ జానెస్‌ తెలిపింది.

ఎప్పటికల్లా సదరు దేశానికి ఈ వ్యవస్థను డెలివరీ చేసేది వెల్లడించలేదు. తమ డోమ్‌ వ్యవస్థపై భారత్‌ ఆసక్తి చూపుతోందని గతేడాది ఇజ్రాయెల్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొనే, తాజాగా ఐఏఐ చేసిన ప్రకటనలోని దేశం ఇండియా అని పలువురు అంచనా వేస్తున్నారు. భారత్‌ వద్ద ప్రస్తుతం ఎలాంటి యాంటీ డ్రోన్‌ వ్యవస్థ లేదని రక్షణ నిపుణుడు అభిజిత్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. జమ్మూ ఘటనల నేపథ్యంలో ఈ డోమ్‌ వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, భారత్‌కు ఇజ్రాయెల్‌ నమ్మకమైన రక్షణ భాగస్వామి కావడం వల్ల సీ–యూఏఎస్‌ను భారత్‌ కొనుగోలు చేసేందుకు అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నట్లు చెప్పారు.  

ఇలా పనిచేస్తుంది
ఒకవైపు నుంచి వచ్చే దాడులనే కాకుండా పలువైపుల నుంచి వచ్చే దాడులను సైతం డ్రోన్‌ గార్డ్‌ అడ్డుకోగలదు. ఇందులో షార్ట్, మీడియం, లాంగ్‌ రేంజ్‌ (3, 4.5, 6కిలోమీటర్ల రేంజ్‌)వేరియంట్లుంటాయి. ఇందులో వివిధ విభాగాలుంటాయి. ఒక్కో విభాగంలో సెన్సర్లు ఒక్కో పని నిర్వహిస్తాయి. ఏఈఎస్‌ఏ, మల్టి మిషన్‌ 3డీ ఎక్స్‌ బాండ్‌ రాడార్, కామిన్ట్‌ జామర్, ఈఓ మరియు ఐఆర్‌ సెన్సర్‌ అనే విభాగాలు డ్రోన్‌ గార్డ్‌లో ఉంటాయని ఐఏఐ తెలిపింది. వచ్చిన డ్రోన్లను అడ్డుకొని వెనక్కు పంపడాన్ని సాఫ్ట్‌ కిల్‌ అని, డీకేడీ(డ్రోన్‌ కిల్‌ డ్రోన్‌) వ్యవస్థను ఉపయోగించి వచ్చిన డ్రోన్లను పేల్చేయడాన్ని హార్డ్‌ కిల్‌ అని అంటారు. తమ సీ– యూఏఎస్‌ చిన్న, సూక్ష్మ డ్రోన్ల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తుందని ఐఏఐ అధికారి ఎలి అల్‌ఫాసి వివరించారు. తమ వ్యవస్థలోని జామింగ్‌ ఫీచర్‌ దాడికి వచ్చిన డ్రోన్స్‌ వెనక్కు వెళ్లేలా లేదా క్రాష్‌ అయ్యేలా చేస్తుందన్నారు. ఇప్పటికే పలువురు కస్టమర్లకు దీన్ని విక్రయించామని, భారత్‌ కూడా దీనిపై ఆసక్తి చూపిందని గతంలో ఆయన చెప్పారు.  

తాజా దాడుల ప్రభావం?
జమ్మూలో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ పై ఇటీవల డ్రోన్‌ దాడి జరిగింది. దాని తర్వాత పాక్‌లోని భారత రాయబారి కార్యాలయ సమీపంలో డ్రోన్లు తచ్చాడాయి. జమ్మూ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌పై దాడికి వచ్చిన డ్రోన్‌లో జీపీఎస్‌ అడ్రస్‌ను లాక్‌ చేశారు. అంతేకాకుండా  పేలుడు పదార్థాలను సైతం డ్రోన్‌ జారవిడిచింది. ఫలితంగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దేశ మిలటరీ చరిత్రలో ఇది తొలి డ్రోన్‌ అటాక్‌గా భావిస్తున్నారు. దాడిలో పాక్‌ టెర్రరిస్టుల పాత్ర ఉంటుందని జాతీయ భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది ఉగ్రదాడిగా జమ్మూ పోలీసు చీఫ్‌ ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో మరిన్ని డ్రోన్‌ దాడులు జరగకుండా నివారించేందుకు సిద్ధమైంది. ఇటీవలే ప్రధాని హోం, రక్షణ మంత్రులతో పాటు భద్రతా సంస్థలు, మిలటరీ అధికారులతో సమావేశమయ్యారు. అత్యున్నత రక్షణ విధానాన్ని రూపొందించాలని çనిర్ణయించారు. దీన్లో భాగంగానే డ్రోన్‌ గార్డ్‌ను భారత్‌ కొనుగోలు చేసి ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం.

మరిన్ని వార్తలు