హిట్లర్‌లోనూ యూదుల రక్తం అంటూ.. రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ వ్యాఖ్యల దుమారం

3 May, 2022 08:51 IST|Sakshi

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్‌ సహా పలుదేశాల అధినేతలు, ప్రతినిధులు లావ్‌రోవ్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. 

ఇటలీకి చెందిన ఓ మీడియా సంస్థ తాజాగా రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా.. ‘‘ఉక్రెయిన్‌ను డీ-నాజీఫై చేస్తామంటూ ప్రకటించుకున్న రష్యా.. తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందంటూ లావ్‌రోవ్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ స్వయంగా ఓ యూదు. అయినప్పటికీ.. ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు.  కానీ, హిట్లర్‌లోనూ యూదు రక్తం ఉంది కదా. అదేం విషయం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి యాయిర్‌ లాపిడ్‌ ఒక ప్రకటనలో.. లావ్‌రోవ్‌ వ్యాఖ్యలు క్షమించరానివి. చారిత్రక తప్పిదం. ఇలాంటి అబద్ధాలు చరిత్రలో భయంకరమైన నేరాలకు యూదులనే నిందిచడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయన్నారు. హోలోకాస్ట్‌ యూదులు తమను తాము చంపుకోలేదని స్పష్టం చేశారాయన. ఇక ఈ వ్యాఖ్యలపై రష్యా రాయబారిని పిలిపించి.. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ ఆదేశించింది. మరోవైపు నిరాధారమైనవని వరల్డ్‌ హోలోకాస్ట్‌ రిమెంబరెన్స్‌ సెంటర్‌ యాద్‌ వాషెమ్‌ ఖండించింది. 


రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌

ఉక్రెయిన్‌ను డీ మిలిటరైజ్‌, డీ నాజిఫై చేయడమే తమ లక్ష్యమని ఇదివరకే రష్యా ప్రకటించింది. కానీ, ఈ క్రమంలో ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు లావ్‌రోవ్‌. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలపై ఇజ్రాయెల్‌ మొదటి నుంచి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఒకవైపు కీవ్‌-మాస్కో మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని చెబుతూనే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా రష్యాతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలను కొనసాగిస్తోంది. అయితే లావ్‌రోవ్‌ హిట్లర్‌-యూదుల రక్తం వ్యాఖ్యలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 


ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి యాయిర్‌ లాపిడ్‌

ఇదిలా ఉండగా.. రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై కెనెడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అభ్యంతరం వ్యక్తం చేశాడు. లావ్‌రోవ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా, ఆమోదయోగ్యం కానీ రీతిలో ఉన్నాయంటూ మండిపడ్డారు.

చదవండి: ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు