అల్‌ జజీరా మహిళా జర్నలిస్ట్‌ను చంపిన ఇజ్రాయిల్‌ దళాలు

12 May, 2022 06:18 IST|Sakshi
అల్‌జజీరా జర్నలిస్టు షిరీన్‌ మృతదేహం

జెరూసలేం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్‌బ్యాంక్‌ సిటీలో కవరేజీ సందర్భంగా అల్‌ జజీరా చానల్‌ మహిళా జర్నలిస్టు షిరీన్‌ అబు అక్లా (51) ప్రాణాలు కోల్పోయారు. మరో జర్నలిస్టు అలీ సమోదీ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు.

ఇజ్రాయెల్‌ ఆర్మీయే ఈ దారుణానికి పాల్పడిందని అల్‌ జజీరా ఆరోపించింది. ఇజ్రాయెల్‌ సైనికులు షిరీన్‌ తలపై నేరుగా తుపాకీ పెట్టి కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు పాలస్తీనా కూడా చెబుతోంది. ఈ ఆరోపణల్ని ఇజ్రాయెల్‌ తోసిపుచ్చింది. పాలస్తీనా ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారంది.

బులెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకున్నా...
కవరేజీ సమయంలో షిరీన్‌ తలకు హెల్మెట్‌ పెట్టుకున్నారు. బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించారు. దానిపై ప్రెస్‌ అని రాసుంది. ఆమె చెవి కింద తూటా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై విచారణకు ఇజ్రాయెల్‌ ప్రధాని ఆదేశించారు. పాలస్తీనా సాయుధుల కాల్పుల్లోనే ఆమె చనిపోయినట్టు తమకు సమాచారముందన్నారు. 

మరిన్ని వార్తలు