మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

12 May, 2021 07:40 IST|Sakshi
(ప్రతీకాత్మక చిత్రం)

వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయిల్‌

దక్షిణ ఇజ్రాయిల్‌పైకి హమాస్‌ రాకెట్ల ప్రయోగం

28 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయిల్‌వాసులు మృతి

గాజా సిటీ: ఇజ్రాయిల్‌– పాలస్తీనాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. జెరూసలేంలో కొద్దివారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు పెరిగి... యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. సోమవారం సూర్యాస్తమయం నుంచి గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి వందలకొద్ది రాకెట్‌ బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయిల్‌ పౌరులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. దీంతో ఇజ్రాయిల్‌ వైమానిక దాడులకు దిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రోజంతా ఎడతెగకుండా గాజాపై బాంబుల వర్షం కురిపించింది.

ఉగ్రవాదులు లక్ష్యంగా సాగిన ఈ దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 16 మందిని ఉగ్రవాదులేనని ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. హమాస్‌ దాడులపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఊహించని స్థాయిలో హమాస్‌పై దాడులుంటాయని హెచ్చరించారు. 5000 మంది రిజర్వ్‌ సైనికులను గాజా సరిహద్దుకు తరలించాల్సిందిగా రక్షణ మంత్రి ఆదేశాలిచ్చారు. జెరూసలేంలోని అల్‌ అక్సా మసీదు వద్ద సోమవారం ఇజ్రాయిల్‌ సైనికుల, పాలస్తీనియన్లకు మధ్య జరిగిన గొడవలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇవి కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీశాయి. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ముస్లిం దేశాలు మంగళవారం తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్‌ చర్యను పాశవికమని పేర్కొన్నాయి.


చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా
చదవండి: తుపాకీకి భయపడి బిల్డింగ్‌ పైనుంచి దూకిన చిన్నారులు

మరిన్ని వార్తలు