బంధించారు.. కర్రలతో కొట్టారు.. నరకం కనిపించింది!

25 Oct, 2023 13:45 IST|Sakshi

 గాజా సొరంగంలోకి  చేరుకున్నాక బాగానే చూసుకున్నారు

హమాస్‌ చెరనుంచి విడుదలైన మహిళ లిఫ్‌షిట్జ్ వెల్లడి 

టెల్‌ అవీవ్‌:  17 రోజులుగా తమ చెరలో ఉన్న యోచెవ్డ్ లిఫ్‌షిట్జ్(85), నురిట్‌ కూపర్‌(79) అనే ఇద్దరు మహిళలను హమాస్‌ మిలిటెంట్లు సోమవారం విడుదల చేశారు. మానవతా దృక్పథంతోపాటు వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినట్లు  తెలిపారు. స్నేహితులైన వారిద్దరూ ఇజ్రాయెల్‌–గాజా సరిహద్దు లోని కిబుట్జ్‌ నిర్‌ ఓజ్‌ నివాసితులు. మంగళవారం టెల్‌ అవీవ్‌కు చేరుకున్నారు. మిలిటెంట్ల అధీనంలో తనకు ఎదురైన అనుభవాలను యోచెవెడ్‌ లిఫ్‌షిట్జ్‌ మీడియాతో పంచుకున్నారు.

‘ఈ నెల 7న మిలిటెంట్లు నన్ను బంధించారు. మోటార్‌బైక్‌ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ప్రతిఘటించినందుకు కర్రలతో కొట్టారు. రోదించినా పట్టించుకోలేదు. గాజాకు బలవంతంగా తరలించారు. ఒక సొరంగంలోకి తీసుకెళ్లారు. భూగర్భంలో సాలెగూళ్లలాంటి సొరంగాలు ఉన్నాయి. మేము వెళ్లేసరికి డాక్టర్లు, వైద్య సిబ్బంది అక్కడున్నారు. తాము ఖురాన్‌ను విశ్వసిస్తామని, ఎలాంటి హాని కలిగించబోమంటూ మిలిటెంట్లు మాతో చెప్పారు. డాక్టర్లు మాకు వైద్య సేవలు అందించారు. కావాల్సిన ఔషధాలు ఇచ్చారు. సొరంగాలు తడిగా, తేమగా ఉన్నాయి. అక్కడ పారిశుధ్య సౌకర్యాలు ఫరవాలేదు. మాకు ఎలాంటి అస్వస్థత కలగలేదు. పరుపులపై నిద్రించాం.

మిలిటెంట్లు మొదట్లో గాజాకు తీసుకెళ్లేటప్పుడు హింసించినా అక్కడికి వెళ్లిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇజ్రాయెల్‌–గాజా సరిహద్దులో నిర్మించిన రక్షణ కంచె గురించి చెప్పాలి. లక్షల డాలర్లు ఖర్చుచేసి ఇజ్రాయెల్‌ సైన్యం ఈ నిర్మించిన ఈ కంచెతో  ఉపయోగం శూన్యం. దేశానికి అది ఏమాత్రం రక్షణ క ల్పించడం లేదు. అత్యంత ఖరీదైన ఈ ఫెన్సింగ్‌ను మిలిటెంట్లు సులభంగా ధ్వంసం చేసి వచ్చి, మమ్మల్ని అపహరించారు. హమాస్‌ నుంచి ఎదురవుతున్న ముప్పును ఇజ్రాయెల్‌ సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని లిఫ్‌షిట్జ్ఆక్షేపించారు. లిఫ్‌షిట్జ్, నురిట్‌ కూపర్‌ భర్తలు ఇంకా హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు