Israel-Hamas war: దిగ్బంధంలో ఆస్పత్రులు

11 Nov, 2023 05:27 IST|Sakshi
రఫాలో శిథిలాల మధ్య దిగాలుగా కూర్చున్న చిన్నారులు

గాజా సిటీలో నాలుగు హాస్పిటళ్ల సమీపంలో భీకర దాడులు 

హమాస్‌ కమాండర్లు సహా 19 మంది మిలిటెంట్లు హతం!  

ఖాన్‌ యూనిస్‌/టెల్‌ అవీవ్‌:  దక్షిణ గాజాకు బారులు కట్టిన జనం.. హమాస్‌ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. వీధుల్లో భూతల పోరాటాలు.. ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ సైనికులు.. గాజా స్ట్రిప్‌లో ప్రస్తుత దృశ్యమిదీ. గాజా సిటీలోని నాలుగు పెద్ద ఆసుపత్రులపై ఇజ్రాయెల్‌ సైన్యం గురిపెట్టింది. హమాస్‌ కమాండ్‌ సెంటర్లు అక్కడే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని తేల్చిచెప్పింది.

శుక్రవారం తెల్లవారుజామునే నాలుగు ఆసుపత్రుల సమీపంలో క్షిపణి దాడులు చేసింది. గాజాలో అతిపెద్దదైన అల్‌–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో 24 గంటల వ్యవధిలో ఐదుసార్లు క్షిపణులు ప్రయోగించింది. కొన్ని వార్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో కంటే ఆసుపత్రిలోనే భద్రత ఉంటుందని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వేలాది మంది జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగంలా కాలం గడిపారు. అల్‌–ఫిఫా హాస్పిటల్‌ వద్ద జరిగిన దాడుల్లో ఒకరు మరణించారని, మరికొందరు గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. కానీ, తమ సైన్యం దాడుల్లో 19 మంది మిలిటెంట్లు హతమయ్యారని, వీరిలో హమాస్‌ కీలక కమాండర్, ప్లాటూన్‌ కమాండర్‌ సైతం ఉన్నారని ఇజ్రాయెల్‌ వెల్లడించింది.

20 రాకెట్‌ లాంచర్లు నిల్వ చేసిన హమాస్‌ షిప్పింగ్‌ కంటైనర్‌ను ధ్వంసం చేశామని తెలియజేసింది. గాజాసిటీలోని నాలుగు ఆసుపత్రుల చుట్టూ ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. ఇజ్రాయెల్‌ సేనలు గాజా నగరంలోకి మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాసిటీలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేయగా, 20 పాలస్తీనియన్లు మరణించారని స్థానిక అధికారులు చెప్పారు.  

మృతులు 11,078.. క్షతగాత్రులు 27,000  
ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 11,078 మంది మరణించారని, వీరిలో 4,506 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. 27,000 మంది గాయపడ్డారని తెలిపింది. మరో 2,650 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా ఇప్పటికే మృతిచెంది ఉండొచ్చని తెలుస్తోంది.

వలస వెళ్తున్నవారిపై వైమానిక దాడులు!  
ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు చేరుకోవడానికి వీలుగా ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతిరోజూ దాదాపు 4 గంటలపాటు దాడులకు విరామం ఇస్తోంది. ఇకపై నిత్యం విరామం అమల్లో ఉంటుందని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. గత ఐదు రోజుల్లో 1,20,000 మంది దక్షిణ గాజాకు వెళ్లిపోయారు. వారిపైనా వైమానిక దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందుతోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలతోప్రతిరోజు దాదాపు 100 వాహనాలు గాజాకు చేరుకుంటున్నాయి. మరోవైపు, హమాస్‌ మిలిటెంట్లపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. గాజాలో హమాస్‌ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేవరకూ అవి కొనసాగుతాయన్నారు.

ఉత్తర గాజా.. భూమిపై నరకం  
గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల స్థావరాలతోపాటు సాధారణ జనవాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్‌ 7న యుద్ధం ప్రారంభం కాగా, గాజాలో ఇప్పటికే దాదాపు 50 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాలుగా మారిపోయాయి. ప్రధానంగా ఉత్తర గాజాలో పరిస్థితి భీతావహంగా మారింది. ఈ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్‌ ఆఫీసు ఉత్తర గాజాను ‘భూమిపై నరకం’గా అభివరి్ణంచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.   

మరిన్ని వార్తలు