Israel Protests: ఇజ్రాయెల్‌లో నిరసన జ్వాల.. ప్రధాని నెతన్యాహూ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

27 Mar, 2023 16:16 IST|Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో వేలాది మంది ప్రజలు నిరసనబాట పట్టారు. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో తనను తాను కాపాడుకోవాలని చూస్తున్న ప్రధాని బెంజిమన్ నేతన్యాహూకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. సంస్కరణలు ఆపాలని కోరిన రక్షణమంత్రి యోవ్ గ్యాలంట్‌ను నెతన్యాహు పదవి నుంచి తప్పించిన మరునాడే జనం రోడ్లెక్కి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని అనేక మంది భారీ ర్యాలీగా ఆందోళనల్లో పాల్గొని తమ గళం వినిపించారు. జెరూసలేంలోని నెతన్యాహు నివాసం సమీపానికి చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, సైనికులు వారిపై భాష్పవాయువు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ జైలు శిక్ష పడకుండా తనను తాను కాపాడుకునేందుకు  న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో మార్పులు చేయాలనుకుంటున్నారు. జడ్జీల నియామకం, ప్రభుత్వం ఆమోదించిన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కోర్టులకు తొలగించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు ఈసంస్కరణల్లో ఉన్నాయి.  వీటిని అమలు చేయొద్దని చెప్పిన రక్షణమంత్రిని కూడా నెతన్యాహూ పదవి నుంచి తొలగించారు.

దీంతో రక్షణమంత్రికి మద్దతుగా, న్యాయవ్యవస్థలో సంస్కరణలకు వ్యతిరేకంగా లక్షలాది మంది పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. రోడ్లు, వీధుల్లో  జెండాలు పట్టుకుని నిరసన తెలియజేశారు.

విమాన సేవలు నిలిపివేత..
ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో విమాన సేవలు నిలిపివేశారు అధికారులు. ఎయిర్‌ పోర్టు వర్కర్క్‌ యూనియన్ సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అతిపెద్ద ట్రేడ్ యూనియన్ సమ్మెకు దిగడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
చదవండి: జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్‌ చేసి మరీ..

మరిన్ని వార్తలు